రెండుళ్లుగా ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమం భారత్ చేపట్టి నేటితో ఏడాది పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా టీకాల కార్యక్రమం చేబడుతున్న ఘనత భారత్ కు దక్కుతుందని ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా దీనిని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేసిన హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ప్రజలందరికీ ఆయన ఓ ట్వీట్లో అభినందనలు తెలిపారు.
”ఈ రోజుతో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, ప్రతి ఒక్కరి కృషితో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా ఇది నిలిచింది” అని మంత్రి తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఏడాది వ్యవధిలో 156.76 కోట్ల వ్యాక్సినేషన్ కవరేజ్ పూర్తి చేసుకుంది. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. తొలుత హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వారికి, అనంతరం 45 పైబడిన వాళ్లకు విస్తరించారు. ఆ తదుపరి 18 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు.
2022 జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టారు. ఇదే సమయంలో 60 ఏళ్లు పైబడిన వారికి, హెల్త్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్‌లు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలైంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం ఉదయం 7 గంటల వరకూ అర్హులైన వారికి 156 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోసులు ఇచ్చారు. గత 24 గంటల్లో 66 లక్షల వ్యాకినేషన్ డోస్‌లు వేశారు.
తాజాగా 2.71 లక్షల కరోనా కేసులు
మరోవంక, భారతదేశంలో మరోసారి కరోనా విజృంభన మరింతగా పెరుగుతుంది. తాజాగా దేశవ్యాప్తంగా 2,71,202 కరోనా కేసులు రాగా, 314 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,50,377 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పాజిటివిటీ రేటు 16.28 శాతంగా ఉంది.
దీనితో పాటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్యం 7,743కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,38,331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజురోజుకు కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.
థర్డ్‌వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు విధించాయి.
ఏపీలో కూడా ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో పాఠశాల సెలవులను పొడిగించారు.