వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ `చలో సెక్రటేరియట్ ‘ నినాదంతో ప్రభుత్వంపై తొలి బాణం సంధించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ సచివాలయం ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులుఅడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్పిలుపు మేరకు చలో సచివాలయం నిరసనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుచెప్పటమే కాదు… ఏపీలో ఎక్కడిక్కడే కాంగ్రెస్ నేతలను గృహనిర్బంధం చేశారు.
గిడుగురాజును, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్టు చేయటంతో ఆంధ్రరత్న భవన్ ఎదుట షర్మిల ధర్నాకు దిగారు. కాంగ్రెస్ శ్రేణులు అధికసంఖ్యలో విజయవాడకు చేరుకోగా చలో సచివాలయానికి షర్మిల బయలుదేరారు. ఈ సందర్భంగా విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారీ సంఖ్యలో పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు.
అయినా చలో సచివాలయానికి షర్మిల బయలుదేరగా తాడేపల్లిలో పోలీసులతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అక్కడ ఆమెను అరెస్టు చేసి మంగళగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైఎస్ఆర్ ఆత్మ క్షోబిస్తుందని, ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్ బిడ్డ పోరాటం నిరుద్యోగుల కోసమే పోరాటం చేసిందని, సచివాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదా? అంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట, సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు, వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం అంటూ ఆమె ధ్వజమెత్తారు.
బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదు, ఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయం అని షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో నిరుద్యోగమే అతిపెద్ద సమస్యని చెబుతూ 2.3 లక్షల మందికి జగన్ అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ల వరద పారిస్తామని మాట ఇచ్చారని, ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ ఎందుకివ్వలేదు? అంటూ ఆమె ప్రశ్నించారు.
ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని. ఉపాధి లేక 21 వేలమంది ఆత్మహత్య చేసుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తుంటే మమ్మల్ని ఎందుకు నియంత్రిస్తున్నారని ఆమె నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, జర్నలిస్టులకు మాట్లాడే హక్కు లేదా? ఇది భారతదేశమేనా లేదా అప్ఘనిస్థానా? కర్ఫ్యూ వాతావరణం ఎందుకు సృష్టించారని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను మీ బంటుల్లా వాడుకుంటారా? మేం ఏమైనా తాలిబన్లామా? అని షర్మిల ప్రశ్నించారు.. ప్రజాస్వామ్యం లేదా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేం ఆందోళన చేస్తే మీకెందుకు భయం? మేం ప్రజలకు దగ్గరవుతామని మీకు భయమా? మెగా డీఎస్సీ కాకుండా.. దగా డీఎస్సీ ఇచ్చారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు వైసీసీ కార్యకర్తలకు ఇచ్చారు సరే, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలెక్కడ? అని షర్మిల ప్రశ్నించారు.