ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున తన ఇంల్లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన అల్జీమర్స్ తో బాధపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జన్నత్ హుస్సేన్ మృతిపై పలువురు రాజకీయ నేతలు, అధికారులు సంతాపం ప్రకటించారు.
జన్నత్ హుస్సేన్ 1977 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. పలు జిల్లాలకు కలెక్టర్‌గా, పలు విభాగాలకు కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010 డిసెంబరు 31న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో హుస్సేన్ఉద్యోగ విరమణ చేశారు.
సీఎం రోశయ్య హయాంలో సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.. 2014 వరకూ పదవిలోనే ఉన్నారు. నాలుగు దశాబ్ధాలపాటు అధికారిగా తెలుగు ప్రజలకు జన్నత్ హుస్సేన్ తన సేవలు అందించారు. వైఎస్సార్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సమయంలో ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారు. ఆనాడు ఆ ఫైల్ అందించింది ఈయనే. అంతేకాదు.. నాడు ఉచిత విద్యుత్తు పథకం విధివిధానాల్ని ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ హోదాలో హుస్సేను రూపొందించారు.
హుస్సేన్‌కుభార్య, ఇద్దరు కొడుకులు.. ఓ కూతురుఉన్నారు. ఉద్యోగ విరమణ తరువాత ఆయన సూళ్లూరుపేటలో తన రెండో కుమారుని వద్ద ఉన్నారు. అయితే కొన్నేళ్ల కిందట ఆయన అల్జీమర్స్ బారిన పడ్డారు. ఉన్నత పదవిలో తాను పనిచేసిన విషయం ఆయనకు ఏమాత్రం గుర్తులేకుండా పోయింది. ఆయన ఉన్న స్థితి చాలామందిని కదిలించింది.
జన్నత్ హుస్సేన్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. వారి ఫ్యామిలీ, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.