మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మూడు గంటలకు తుది శ్వాస విడిచారు. కొద్దినెలల క్రితం మనోహర్ జోషి మెదడులో రక్తస్రావం కారణంగా హిందూజా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా మారితే డిశ్చార్జ్ చేస్తామని ఇటీవల వైద్యులు తెలిపారు. అయితే ఈ సమయంలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో మనోహర్ జోషి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మనోహర్ జోషి 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. శివసేన పార్టీ నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మొదటి నాయకుడు మనోహర్ జోషి కావడం విశేషం.
1937 సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన లా రాయఘడ్ జిల్లాలోని గవిఝలలో పేద కుటుంబంలో జన్మించిన మనోహర్ జోషి, చిన్నతనం నుండే రాజకీయాలపై విపరీతమైన ఆసక్తిని కనపరిచి, రాజకీయాలలోకి వచ్చారు. చిన్నప్పటినుంచి వ్యవస్థలోని సమస్యలపై పోరాటం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉన్న మనోహర్ జోషి తను బాల్యం నుంచి చూస్తున్న అనేక సమస్యలపై పోరాటం సాగించాలని రాజకీయాల్లోకి వచ్చారు.
మొదట కార్యకర్తగా ప్రవేశించి కార్పొరేటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కాలంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎంపీగా, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిగా, లోక్సభ స్పీకర్ గా , రాజ్యసభ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేశారు.
శివసేన పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నేత బాలసాహెబ్ థాకరేకు అత్యంత సన్నిహితుడుగా మనోహర్ జోషికి గుర్తింపు ఉంది. 1995లో ముఖ్యమంత్రి అయిన మనోహర్ జోషి మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన నేతగా గుర్తింపును సాధించారు. ఎంపీ గా కూడా పని చేసిన మనోహర్ జోషి 2002 నుంచి 2004 వరకు వాజపేయి ప్రభుత్వ హయాంలో లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించారు. ముంబైలో ఆయన విద్యాభ్యాసం సాగించారు. అనఘ మనోహర్ జోషిని ఆయన పెళ్లాడారు. 75 ఏళ్ల వయసులో ఆమె 2020లో మరణించారు. ఆ జంటకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.