కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ జైమే సావేడ్ర స్పష్టం చేశారు. కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివరి నిర్ణయంకావాలని హితవు చెప్పారు. పాఠశాలలను పునఃప్రారంభించడం వల్ల కరోనా వైరస్ కేసులు పెరిగాయని, పాఠశాలలు సురక్షిత ప్రదేశాలు కాదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు.
జైమే సావేడ్ర బృందం విద్యా రంగంపై కరోనా ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావేడ్ర మాట్లాడుతూ, బాలలకు టీకాలు ఇచ్చే వరకు వేచి చూడాలనడంలో అర్థం లేదని చెప్పారు. ఈ దృక్పథానికి సైన్స్‌పరమైన ఆధారమేదీ లేదని పేర్కొన్నారు. పాఠశాలలను తెరవడం, కరోనా వైరస్ వ్యాపించడం మధ్య సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ మహమ్మారి పేరుతో పాఠశాలలను మూసివేయడంలో ఔచిత్యం లేదని చెప్పారు.
కొత్త ప్రభంజనాలు వచ్చినప్పటికీ పాఠశాలలను మూసేయడమనేది చిట్టచివర తీసుకోవలసిన నిర్ణయం కావాలని పేర్కొన్నారు. బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌ను తెరచి ఉంచి, పాఠశాలలను మూసివేయడంలో అర్థం లేదని అంటూ ఇది సరైనది కాదని స్పష్టం చేశారు.
2020లో మన సముద్ర యానం అయోమయంగా, అగమ్యగోచరంగా ఉండేదన్నాని, కరోనా మహమ్మారితో ఎలా పోరాడాలో, ఏది మంచి విధానమో అప్పట్లో తెలియదని గుర్తు చేశారు. దానితో వెంటనే చాలా దేశాల నుంచి వచ్చిన ప్రతిస్పందన పాఠశాలలను మూసేయాలనేనని చెప్పారు. ఆ తర్వాత చాలా కాలం గడిచిందని, 2020, 2021లలో అనేక ప్రభంజనాలు వచ్చాయని, ఆధారాలు లభించాయని తెలిపారు. అదేవిధంగా చాలా దేశాల్లో పాఠశాలలను తెరిచారని చెప్పారు.
పాఠశాలలను తెరవడం వల్ల వైరస్ వ్యాప్తిపై ప్రభావం పడుతోందా? అనేఅంశాన్ని పరిశీలించగలిగామని చెప్పారు. అటువంటిదేమీ లేదని తాజా సమాచారం చెప్తోందని పేర్కొన్నారు. చాలా దేశాల్లో పాఠశాలలను మూసివేసిన సమయంలో కూడా కరోనా ప్రభంజనాలు వచ్చాయని అంటూ దీనినిబట్టి చూసినపుడు కొన్ని ప్రభంజనాల్లో పాఠశాలల పాత్ర లేదని స్పష్టమవుతోందని వివరించారు.
బాలలు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం, ఒమైక్రాన్ సోకే అవకాశం ఉన్నప్పటికీ, మరణాలు, తీవ్రమైన అస్వస్థత సంభవించే పరిస్థితులు అత్యంత అరుదు అని చెప్పారు. బాలలకు ప్రమాదాలు చాలా తక్కువ అని, అయితే పాఠశాలల మూసివేత వల్ల పర్యవసానాలు చాలా తీవ్రమైనవని హెచ్చరించారు.