భారత్ తో సహా సరిహద్దు ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బీజింగ్ ప్రవర్తన అస్థిరతను కలిగిస్తుందని వాషింగ్టన్ విశ్వసిస్తున్నందున, భారతదేశంతో సహా దాని పొరుగు దేశాలను “భయపెట్టడానికి” చైనా చేసిన ప్రయత్నంపై అమెరికా ఆందోళన చెందుతోంది. అయినా, అమెరికా తన భాగస్వాములతో పాటు కొనసాగుతుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది .
తూర్పు లడఖ్‌లో 20 నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్, చైనాల మధ్య 14వ రౌండ్ సైనిక స్థాయి చర్చలు జరగటానికి ముందు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ నుండి ఈ వాఖ్యలు రావడం గమనార్హం.
భారత్‌తో సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని, చైనాతో చర్చల సందర్భంగా గాని లేదా నేరుగా గాని వాషింగ్టన్ ఈ అంశంపై బీజింగ్‌కు ఏదైనా సందేశం పంపుతుందా అని గత వారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందిస్తూ భారత్ – చైనా సరిహద్దు వెంబటి పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
సరిహద్దు సమయాలను చర్చలు, శాంతియుత మార్గాలలో పరిష్కరించుకొనే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తూనే ఉంటామని ఆమె తెలిపారు. ఈ ప్రాంతంతో పాటు ప్రపంచంలో బీజింగ్ ప్రవర్తనను ఏ విధంగా చూడాలో తాము చాలా స్పష్టంగా తెలుసుకున్నామని ఆమె పేర్కొన్నారు.
“ఇది అస్థిరతను కలిగిస్తుందని మేము నమ్ముతున్నాము. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తన పొరుగు దేశాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నదని మేము ఆందోళన చెందుతున్నాము. ఈ విషయమై మేము మా భాగస్వాములతోనే కలసి ఉంటాము” అని ఆమె స్పష్టం చేశారు.
అయితే జనవరి 12న సైనిక స్థాయిలో భారత్ – చైనా మధ్య జరిగిన చర్చలు ఉమ్మడి ప్రకటన చేయడం మినహా ఎటువంటి పురోగతి సాధింపలేక పోయాయి. త్వరలో తిరిగి సమావేశమవుతున్నట్లు ఇరువురు ప్రకటించారు.
తూర్పు లడఖ్‌లో మిగిలి ఉన్న ఘర్షణ పాయింట్లలో సమస్యలను పరిష్కరించడానికి చైనాతో “నిర్మాణాత్మక” సమాలోచనాలకోసం ఎదురు చూసిన భారత్ కు నిరాశే ఎదురైనది. చర్చలలో ప్రధానంగా దృష్టి హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం ప్రస్తావనకు వచ్చినా ఒక అవగాహనకు రాలేకపోయారు.
దేప్సాంగ్ బల్గే, డెమ్చోక్లలోని సమస్యల పరిష్కారంతో సహా మిగిలిన అన్ని ఘర్షణ పాయింట్లలో వీలైనంత త్వరగా అవగాహనకు రావాలని భారత్ స్పష్టం చేస్తున్నది. సైనిక, దౌత్యపరమైన చర్చల పరంపర ఫలితంగా, పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరం, గోగ్రా ప్రాంతంలో గత సంవత్సరం ఇరుపక్షాలు అవగాహనకు రాగలిగాయి.
ఇరువైపులా ప్రస్తుతం 50,000 నుండి 60,000 మంది చొప్పున సైనికులు సున్నితమైన సెక్టార్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మోహరించి ఉన్నారు. వనరులు విస్తారంగా గల ఇండో- పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా సైనిక విన్యాసాల కారణంగా ఆందోళన చెందుతున్న భారత్, అమెరికా, అనేక ఇతర దేశాలు స్వేచ్ఛ, బహిరంగ కార్యకలాపాలకు అక్కడ అవకాశం ఉండాలని స్పష్టం చేస్తున్నాయి.
తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం వంటి దేశాలు తమకు చెందినవిగా పేర్కొంటున్న దక్షిణ చైనా సాముద్రంలోని దాదాపు సగం భాగాలు అన్ని తనవే అని చైనా వాదిస్తున్నది. అబీజింగ్ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు, సైనిక స్థావరాలను నిర్మించింది. తూర్పు చైనా సముద్రంలో జపాన్‌తో చైనాకు ప్రాదేశిక వివాదాలు కూడా ఉన్నాయి.
స్వేచ్ఛాయుతమైన, బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంత రక్షణలో దాని ప్రాంతీయ మిత్రదేశాలకు మద్దతు ఇస్తామని అమెరికా స్పష్టం చేస్తున్నది. అమెరికా క్రమానుగతంగా దక్షిణ చైనా సముద్రం గుండా నావికా, వైమానిక గస్తీని పంపుతోంది. ఈ ప్రాంతంపై చైనా సార్వభౌమాధికారాన్ని సవాలు చేస్తూ, నావిగేషన్ స్వేచ్ఛను ప్రస్తావిస్తుంది.
శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా సముద్రాల స్వేచ్ఛను సమర్థించాలని, వాణిజ్యంకు అవరోధం లేని ప్రవాహాన్ని కొనసాగించాలని, వివాదాలను పరిష్కరించడానికి బలవంతం చేసే ప్రయత్నాన్ని వ్యతిరేకించాలని అమెరికా చెబుతున్నది.