తమ ఔషధ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రచారం చేయవద్దని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. తాము గత నవంబర్ లో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గానూ పతంజలి ఆయుర్వేద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.
బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణన్ లపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు చేపట్టకూడదో చెప్పాలని షొ కాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అల్లోపతి వైద్య విధానాన్ని విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయవద్దని పతంజలి ఆయుర్వేద సంస్థకు చెందిన బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణన్ లను ఆదేశించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అల్లోపతికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయొద్దని సూచించింది. అల్లోపతి ని విమర్శించడాన్ని అడ్డుకోవాలని, అలాగే, తమ వద్ద అన్ని జబ్బులను నయం చేయగల ఔషధాలు ఉన్నాయని ప్రచారం చేసుకోవడాన్ని నిరోధించాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తూ, సుప్రీంకోర్టు లోని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
అల్లోపతి మందుల సామర్థ్యాన్ని అనుమానిస్తూ వైద్యులను అప్రతిష్టపాలు చేసేలా పతంజలి సంస్థ ప్రకటనలు చేస్తోందని కోర్టు దృష్టికి ఐఎంఏ తీసుకువచ్చింది. ఈ ప్రకటనలపై రాందేవ్ పై, పతంజలి సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రకటనల్లో తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చినందుకు కోర్టు విచారణ సందర్భంగా పతంజలి సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, కేసు విచారణను మార్చి 19 వ తేదీకి వాయిదా వేశారు.