సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరు నెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.
రాజ్యాంగ న్యాయస్థానాలు (సుప్రీంకోర్టు, హైకోర్టులు) సాధారణంగా కింది కోర్టుల్లో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అసాధారణ కేసుల్లో మాత్రమే విచారణను ముగించడానికి గడువును కింది కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు నిర్ణయించవచ్చునని తెలిపింది.
కేసుల విచారణకు ప్రాధాన్యమిచ్చే విషయాన్ని ఆ కేసులు ఏ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయో, అదే కోర్టు విచక్షణకు వదిలిపెట్టడం ఉత్తమమని వివరించింది. 2018లో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఓ కేసులో ఇచ్చిన తీర్పును తాజా తీర్పు కొట్టి వేసింది.
కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన స్టే ఉత్తర్వులు, ప్రత్యేకంగా పొడిగించకపోతే, వాటంతట అవే రద్దవుతాయని త్రిసభ్య ధర్మాసనం అప్పట్లో తీర్పు చెప్పింది. స్టే ఆర్డర్ మంజూరైన తర్వాత ఆరు నెలలు ముగిసిన అనంతరం విచారణ లేదా ప్రొసీడింగ్స్ నిలిచిపోబోవని తెలిపింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చే స్టే ఆర్డర్‌కు ఇది వర్తించదని వివరించింది. ఈ తీర్పుతో ఏకీభవించేది లేదని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది.