వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ నియోజకవర్గ నేతలతో ఆయన ఆదివారం సమావేశమవుతూ లోక్‌సభ ఎన్నికలకు పార్టీ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని సూచించారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో త్వరలో బస్సు యాత్రలు చేద్దామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే సెంటిమెంట్‌గా వస్తున్న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో మార్చి 12న సభకు ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ గెలవబోతోందని జోస్యం చెప్పారు.
అతికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని చెబుతూ రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్తోనే మేలు జరుగుతుందనే చర్చ రాష్ట్ర ప్రజల్లో మొదలైందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ తెలిపారు. ఇందులో ఆయన స్వయంగా పాల్గొనున్నట్లు తెలిపారు.
