భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ సోమనాథ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఆదిత్య ఎల్ 1ప్రయోగం చేపట్టిన రోజే వ్యాధి నిర్ధారణ అయినట్టు తెలిపారు.
ఓ మళయాళం వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్టు చెప్పారు. చంద్రయాన్ 3 ప్రయోగం సమయం లోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆ సమయం లో దాని గురించి నాకు స్పష్టమైన అవగాహన లేదు.
కానీ ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగించిన ఉదయమే వైద్య పరీక్షలు చేయించుకున్నా. కొద్ది సమస్య ఉన్నట్టు గుర్తించారు. ప్రయోగం ముగిసిన తర్వాత చెన్నై వెళ్లి మరిన్ని స్కాన్లు చేయించగా అప్పుడే నాకు అర్థమైంది నా కడుపులో కణితి పెరిగిందని. మరో రెండు మూడు రోజుల తరువాత నిర్ధారణ అయ్యింది.
అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులతోపాటు సహోద్యోగులు షాక్‌కు గురయ్యారని చెప్పారు.
“సెప్టెంబర్ 2. 2023 న ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టిన తరువాత ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం శస్త్రచికిత్సతోపాటు కీమోథెరపీ కూడా చేయించుకున్నా. అలా అవన్నీ భరించాల్సి వచ్చింది. అయితే మొత్తం నాలుగు రోజులై ఆస్పత్రిలో ఉన్నా. ఐదో రోజు నుంచి ఇస్రోలో రోజువారీ బాధ్యతల్లో నిమగ్నమయ్యా. తొలుత కాస్త కంగారు పడినప్పటికీ, క్యాన్సర్‌కు పూర్తి పరిష్కారంగా చికిత్స ఉందన్న విషయంపై ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది” అని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.