ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం తొలిసారిగా అంబులెన్స్ సిబ్బందికి కేంద్ర ఎన్నికల కమీషన్ కల్పించింది. అదే విధంగా గుర్తింపు పొందిన జర్నలిస్టులు కూడా పోస్టుల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని తెలిపింది. అత్యవసర సర్వీసు విభాగాలకు సంబంధించి జాబితాను కమీషన్ విడుదల చేసింది.
ఫుడ్ సివిల్ సప్లై అండ్ కన్జూమర్ అఫైర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా రేడియో, దూర్ దర్శన్, పోస్ట్ అండ్ టెలిగ్రామ్, రైల్వే, బీఎస్ఎన్ఎల్, విద్యుత్, హెల్త్, ఫైర్ సర్వీస్, సివిల్ ఏవియేషన్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం కల్పించారు.
ఇంతకుముందు ఎన్నికల కమిషన్ మీడియా వ్యక్తులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వైకల్యం ఉన్నవారు (40 శాతం కంటే ఎక్కువ), కరోనా రోగులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించి ఓటు వేయడానికి ఈసీ అనుమతించింది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిర్ణయించిన తేదీ కంటే ముందు అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ ఓటింగ్ కేంద్రాలు వరుసగా మూడు రోజుల వరకు ప్రతి రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి.
అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటును వేయాలనుకునేవారు ఎవరైనా గైర్హాజరైన ఓటరు ఫారం-12డిలో రిటర్నింగ్ అధికారికి అవసరమైన అన్ని వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత సంస్థచే నియమించబడిన నోడల్ అధికారి ద్వారా దరఖాస్తును ధృవీకరించాలి.
పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కోరుకునే అటువంటి దరఖాస్తులు ఎన్నికల ప్రకటన తేదీ నుండి సంబంధిత ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నుండి ఐదు రోజుల మధ్య వ్యవధిలో రిటర్నింగ్ అధికారికి చేరుకోవాలి.
పంజాబ్ లో ఫిబ్రవరి 20న ఎన్నికలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20 తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం పంజాబ్‌లో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగాల్సి వుంది. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఎన్నికల తేదీని మార్చాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలు కోరాయని ఇసి తెలిపింది.
ఇదే అంశంపై ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని ఇసికి లేఖ వ్రాసారు. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి సందర్భంగా ఎస్సి కమ్యూనిటీకి చెందిన అధిక శాతం మంది ఫిబ్రవరి 10 నుండి 16వ తేదీ వరకు యుపిలోని వారణాసి సందర్శనకు వెళతారని.. దీంతో ఎక్కువ శాతం మంది పోలింగ్‌లో పాల్గొనలేకపోవచ్చని పేర్కొన్నారు.
రాష్ట్ర జనాభాలో 32 శాతం ఎస్సి కమ్యూనిటీ ప్రాతినిథ్యం వహిస్తున్నందున పోలింగ్‌ను కనీసం ఆరురోజులకి వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.