లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అతిపెద్ద ఊరట లభించింది. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీల్యాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం ఈ కీలకతీర్పునిచ్చింది.
2017 ఆగస్టు 2న ఆదాయ పన్నుశాఖ అధికారులు బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. ఆ సందర్భంలో ఆయన ముఖ్య అనుచరుడి వద్ద లభించిన భారీ నగదును డీకే శివకుమార్ బినామీ ఆస్తిగా పరిగణించిన ఈడీ, మనీల్యాండరింగ్ కేసుగా మార్చి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ డీకే శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నా తీర్పు సానుకూలంగా రాలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు 120-బి పరిధిలోకి రాదని, ఈడీ వాదన చెల్లదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు నుంచి విముక్తి పొందిన తర్వాత శివకుమార్ బెంగళూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని అన్నారు.