టీటీడీ గౌరవ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద తిరుమల ఒకటో పట్టణ పోలీసులు ఇచ్చిన నోటీసును సవాల్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా శ్రీవారి ఆలయం, టీటీడీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీటీడీ ఐటీశాఖ జీఎం సందీప్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల ఒకటో పట్టణ పోలీసులు రమణదీక్షితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసు జారీ చేసి విచారణ నిమిత్తం హాజరుకావాలని కోరారు.
ఈ నోటీసులను సవాలు చేస్తూ రమణదీక్షితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.. పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వలేరని దీక్షితులు తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఆయన వయసు 76 ఏళ్లు అని, 65ఏళ్లు దాటిన నిందితులను ఇంటి వద్దే విచారించాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందని వివరించారు.
పిటిషన్ మొదటిసారి విచారణకు వచ్చిందని.. పూర్తి వివరాలు సమర్పించడానికి పోలీసులకు కొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఇటీవల సోషల్ మీడియాలో రమణ దీక్షితులు వీడియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
టీటీడీతో పాటుగా ఈవో ధర్మారెడ్డి, తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. టీటీడీ ప్రతిష్ట దెబ్బ తినేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయనపై తిరుమల వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే రమణ దీక్షితులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదంటున్నారు.