ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆంక్షల నుంచి స్వేచ్ఛ దొరికిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్నో దశాబ్ధాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్ష పార్టీలు 370 ఆర్టికల్ పేరుతో జమ్మూకశ్మీర్ ప్రజల్ని, దేశాన్ని తప్పుదోవ పట్టించాయని ఆయన ఆరోపించారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్లో పర్యటించారు ప్రధాని మోదీ. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.వికసిత్ భారత్-వికసిత్ జమ్మూ కశ్మీర్ కార్యక్రమం కింద రూ.64వేల కోట్లతో శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియం వేదికగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఎంతో ప్రేమానురాగాలు చూపించే శ్రీనగర్ ప్రజల మధ్య తాను ఉండటం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రేమను గెలిచేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామో వాటితో జమ్ము కశ్మీర్ రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని మోదీ చెప్పారు.
అభివృద్ధి చెందిన భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న జమ్మూ కశ్మీర్ అంతర్భాగం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఒకానొక సమయంలో జమ్మూ కశ్మీర్ ప్రజలు తాము పొందాల్సిన ఫలాలను పొందలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఒకానొక సమయంలో దేశం మొత్తం మీద చట్టం అమలవుతోంటే ఒక్క జమ్మూ కశ్మీర్ మాత్రమే నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలవుతోంటే.. జమ్ము కశ్మీర్లో మాత్రం ఇది సాధ్యమయ్యేది కాదని చెప్పారు. అయితే ఇప్పుడు కాలం మారిందని, ప్రభుత్వాలు మారాయని చెప్పిన ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.
ఆర్టికల్ 370 నుంచి జమ్మూకశ్మీర్ లబ్ధి పొందిందా? లేదా కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే లాభపడ్డాయా? అని ఆయన ప్రశ్నించారు. తమను తప్పుదోవ పట్టించారన్న విషయాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు ఆలస్యంగా గ్రహించారని మోదీ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ కేవలం ఒక ప్రాంతం కాదని మొత్తం భారతదేశానికే ఒక తలమానికమైన ప్రదేశమని మోదీ గుర్తుచేశారు. ఉజ్వలమైన భారతదేశానికి జమ్ము కశ్మీర్ అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని పేర్కొన్నారు.
కొన్ని కుటుంబాల లబ్ధి కోసమే జమ్మూకశ్మీర్‌ను సంకెళ్లలో వేసేశారని ప్రధాని ధ్వజమెత్తారు. ఇవాళ జమ్మూకశ్మీర్‌లో 370 లేదు అని, దీని వల్ల ఆ రాష్ట్ర యువత ప్రతిభకు గౌరవం దక్కుతోందని, ఫలితంగా కొత్త అవకాశాలు వస్తున్నట్లు మోదీ చెప్పారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.