గాల్విన్ లోయలో ఘర్షణ అనంతరం చైనా దిగుమతులపై ఆంక్షలు పెట్టడంతో పాటు, స్వదేశంలో ఉత్పత్తి పెంపొందించడం కోసం, అమెరికాతో ఏర్పడిన వివాదం కారణంగా చైనా నుండి తరలుతున్న పరిశ్రమలను ఆకట్టుకోవడం కోసం భారత్ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాణిజ్యంలో చైనాపై ఆధార పడటం మాత్రం తప్పడం లేదు.
ఆత్మనిర్భర్ భారత్, భారత్ లో తయారీ వంటి విశేష ప్రాచుర్యం పొందిన కార్యక్రమాలు సహితం చైనాపై ఆధారపడటంను తగ్గియింపలేక పోతున్నాయి. కొందరి రిటైల్ వర్తకులు స్వచ్ఛందంగా పండుగల సమయంలో చైనా దిగుమతులను కట్టడి చేసే ప్రయత్నం చేసినా, మొత్తం మీద ప్రభావం కనబడటం లేదు.
గత రెండేళ్లలో చైనా నుండి దిగుమతులు 30 శాతం మేర పెరగడం విస్మయం కలిగిస్తుంది. అదే సమయంలో భారత్ నుండి చైనాకు ఎగుమతు లు సహితం గణనీయంగా పెరగడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది. రెండేళ్లలో 56 శాతం మేరకు పెరిగాయి
గతేడాది చైనాతో భారత వాణిజ్యం 125 బిలియన్ డాలర్లను (రూ.9.29 లక్షల కోట్లకు పైగా) దాటింది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువే దాదాపు 100 బిలియన్ డాలర్లుగా (రూ.7.43 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. ఈ సమాచారాన్ని చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జిఎసి) ఈ నెల 14న విడుదల చేసింది.
ఈ సమాచారం ప్రకారం.. గత 12 నెలల్లో చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 2019లోని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మించిపోయింది. 2019లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 92.8 బిలియన్ డాలర్లుగా ఉన్నది. అయితే, 2020లో కరోనా మహమ్మారి కారణంగా అది 87.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
2019 నుంచి దిగుమతులు 30 శాతం ఎగబాకాయి. కాగా చైనాకు భారత ఎగుమతుల విలువ 28.1 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత రెండేండ్లలో దీనిలో పెరుగుదల 56 శాతంగా నమోదు కావడం గమనార్హం. భారత్ నుంచి చైనాకు జరిగిన అతిపెద్ద ఎగుమతులు ఇనుప ఖనిజం, పత్తి, ఇతర ముడి పదార్ధాల ఆధారిత వస్తువులు ఉన్నాయి.
అయితే గతేడాది చైనాలో ఈ డిమాండ్ పుంజుకున్నది. ఇక చైనా నుంచి భారత్ ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఎపిఐ), ఆటో భాగాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల నుంచి పిపిఇల వరకు అనేక రకాల వైద్య సరఫరాలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్నది.