ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. నారాయణ మూర్తి భార్య గానే కాకుండా, సుధా మూర్తి రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ప్రఖ్యాతి గాంచారు.
రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రకటించారు. సుధామూర్తిని అభినందించిన ప్రధాని మోదీ వివిధ రంగాలకు ఆమె చేసిన కృషి ఎనలేనిదని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ మేరకు సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం సంతోషకరమైన విషయమన్నారు. సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనదని ప్రశంసించారు.
సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనం అని కొనియాడారు. ఎగువ సభకు నామినేట్ అయిన సుధామూర్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.