లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి బరిలో దిగనున్నారు. బెంగళూరు రూరల్ నుంచి డీకే సురేశ్, త్రిశూర్ నుంచి కే మురళీధరన్, తిరువనంతపురం నుంచి శశిథరూర్ పోటీ చేయనున్నారు.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వీటిలో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, జహీరాబాద్ – సురేశ్ షేట్కర్, చేవెళ్ల – సునీతా మహేందర్‌రెడ్డిల పేర్లను ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
అయితే, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచందర్‌రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ వంశీచందర్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్- 6, కర్ణాటక- 6, కేరళ- 15, మేఘాలయా-2, నాగాలాండ్-1, సిక్కిం- 1, త్రిపుర- 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ స్థానానికి శాండల్‌వుడ్ స్టార్ హీరో భార్య గీతా శివరాజ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ వంటి నేతలు ఉన్నారు.