ఎంజీబీఎస్ – ఫలక్నుమా మెట్రో రైలు మార్గానికి ఫారుక్నగర్ బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం జేబీఎస్ – ఎంజీబీఎస్ వరకు ఉన్న మెట్రో లైనును ఫలక్నుమా వరకు ఇంకో 5.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. ఈ రైలు మార్గంలో 5 మెట్రో స్టేషన్లు ఉంటాయి.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాతబస్తీ ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. పాతబస్తీకి వీలైనంత త్వరగా మెట్రోను తీసుకురావడానికి కృషి చేస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. వరుసగా అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎన్నికలు వచ్చిన సమయంలోనే రాజకీయాలు, మిగతా సమయాల్లో అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.
దారుల్షిఫా నుంచి ఆలియాబాద్ మీదుగా సాగే ఈ మార్గంలో సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్నుమా వద్ద 4 మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ మెట్రో లైను నిర్మాణం కనుక పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి నేరుగా ప్రయాణం చేసే వీలుంటుంది. ఎంజీబీఎస్ నుంచి సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషిర్ గంజ్, ఫలక్ నుమా మెట్రో స్టేషన్లు ఉంటాయి.
అయితే, ఈ విస్తరణ కోసం రూ.2 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. కేటాయించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు స్థల సేకరణకే ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు పాతబస్తీ మరింత అభివృద్ధి దిశలో దూసుకుపోనుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
పాతబస్తీ కారిడార్లో రోడ్ల విస్తరణ వల్ల మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితం కానున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ మార్గంలోని ప్రతి మెట్రో స్టేషన్ వద్ద 120 అడుగులు, మిగిలిన ప్రాంతాల్లో 100 అడుగుల విస్తీర్ణంతో రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. మెట్రోరైల్ రెండో దశలో నాగోల్- శంషాబాద్ ఎయిర్పోర్టు మార్గంలో చాంద్రాయణగుట్ట వద్ద అనుసంధానించనున్నారు. చాంద్రాయణగుట్ట వద్ద మేజర్ ఇంటర్చేంజ్ స్టేషన్ను నిర్మించే అవకాశం ఉంది