* కాకినాడ లోక్సభ స్థానం నుంచి బరిలో పవన్ కల్యాణ్
ఢిల్లీ వేదికగా బీజేపీ, టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. గత రెండు రోజులుగా బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంలో జరిపిన సుదీర్ఘ చర్చలు ఫలించాయి.
ఇప్పటి వరకూ బీజేపీ 10 ఎంపీ సీట్లు కోసం పట్టుపట్టగా, ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు బీజేపీకి 6 స్ధానాలు ఇచ్చేందుకు తలూపారు. బీజేపీ మాత్రం 10ఎంపీ సీట్ల కోసం ఒత్తిడి చేసింది. ఈ సమయంలో బిజెపికి ఆరు అసెంబ్లీ, ఆరు లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో జనసేనకు ఒక ఎంపి సీటుకు కత్తెర పడింది. ముందు మూడు లోక్ సభ సీట్లు కేటాయించిన టిడిపి తాజాగా రెండు సీట్లు ఇచ్చింది…
బీజేపీ కీలక నేత అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజకీయాలపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఈ చర్చల సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించినట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. ఏపీ, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఢిల్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం అనంతరం జనసేన, బీజేపీ అభ్యర్థులు ఏయే స్థానాల్లో పోటీ చేస్తారో అంచనా వచ్చింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారో ప్రకటించక పోవటంతో కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని కొత్త జాబితాలో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది.
బీజేపీ, జనసేన నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఈ జాబితా సమాచారం ప్రకారం, కాకినాడ ఎంపీ స్థానంలో పవణ్ కళ్యాణ్ , మచిలీ పట్నంలో వల్లభనేని బాలశౌరి జన సేన నుంచి పోటీ చేయనున్నారు. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురందరేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇక హిందూపురం లేదా అరుకు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కల్యాన్, చంద్రబాబు కలిసి ప్రకటించారు. తాజాగా బీజేపీతో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన 145 స్థానాల్లో టీడీపీనే బరిలో దిగనుంది.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు కైవసం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తులు కుదుర్చుకుంటోంది .