ప్రపంచం మొత్తాన్నీ కట్టిపడేసే కాంపిటీషన్స్ మిస్ వరల్డ్. ప్రతి సంవత్సరం వేర్వేరు దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి. గత ఏదాది ఈ అందాల పోటీలకు ప్యూర్టోరికో ఆతిథ్యాన్ని ఇచ్చింది. కరేబియన్ ఐలండ్స్‌లోని శాన్ జువాన్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్ 2022 పోటీల్లో పోలెండ్ సుందరి కరోలినా బిలావ్స్కా విజేతగా నిలిచారు.
ఈ సారి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇది 71వ ఎడిషన్. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో కలర్ఫుల్గా సాగిన ఈ పోటీల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టీనా సిజ్కోవా మిస్ వరల్డ్ 2024 టైటిల్‌ను ఎగరేసుకెళ్లారు. 12 మంది సభ్యులతో కూడిన ప్యానెల్.. ఆమెను విజేతగా ప్రకటించింది. ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా బిలావ్స్కా ఆమెకు కిరీటాన్ని ధరింపజేశారు.
లెబనాన్‌కు చెందిన యాస్మిన్ జాయ్టన్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న సినీ షెట్టి నిరాశపరిచారు. టాప్ 10లో చోటు దక్కించుకోగలిగారు గానీ.. టైటిల్ వరకూ వెళ్లలేకపోయారు. 2022 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచిన సినీ షెట్టి టాప్ 4లో రాలేకపోయారు. ఎనిమిదో స్థానానికి పరిమితం అయ్యారు.
సాజిద్ నడియాడ్వాలా, కృతి సనన్, పూజా హెగ్, హర్భజన్ సింగ్, రజత్ శర్మ, అమృత ఫడ్నవిస్, వినీత్ జైన్, జూలియా మోర్లీ, జమీల్ సైది ఈ ప్యానెల్లో ఉన్నారు. కరణ్ జోహార్, మేగాన్ యంగ్ ఈ ఈవెంట్‌ను హోస్ట్ చేశారు. ప్లేబ్యాక్ సింగర్లు షాన్, నేహా కక్కర్, టోనీ కక్కర్ల ప్రదర్శన ఆకట్టుకుంది.
27 సంవత్సరాల తరువాత ఈ అందాల పోటీలకు భారత్ వేదికగా మారిన విషయం తెలిసిందే. 1996లో మిస్ వరల్డ్ పోటీలను భారత్‌లో నిర్వహించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీల్లో గ్రీస్‌కు చెందిన ఇరెనా స్క్లీవా అందాల కిరీటాన్ని గెలుచుకున్నారు.