రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారం విడుదల చేసింది. ఈ 72 మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించగా, ఇప్పటి వరకు మొత్తం 15 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక, ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్లో పెట్టింది.
తాజాగా విడుదల చేసిన రెండో జాబితాలో తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థులు విషయానికొస్తే ఆదిలాబాద్ నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి శానంపూడి సైది రెడ్డి, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణను అభ్యర్థులుగా ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. కాగా, సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ఇక, జాతీయ స్థాయిలో పలువురు కీలక నేతలకు రెండో జాబితాలో అవకాశం లభించింది. ప్రముఖ అభ్యర్థులలో హరిద్వార్ నుంచి ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, కర్నాల్ నుంచి హర్యానా తాజా మాజీ ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్, నాగ్పూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఉన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ధార్వాడ్ నుంచి ప్రహ్లాద్ జోషి, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య, హవేరీ నుంచి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి టికెట్ లభించింది.
రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు దక్కగా, దాద్రానగర్ హవేలీ నుంచి ఒకరు, ఢిల్లీ నుంచి ఇద్దరు, గుజరాత్ నుంచి ఏడుగురు, హర్యానా నుంచి ఆరుగురు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి 20 మంది, త్రిపుర నుంచి ఒకరు, ఉత్తరాఖండ్ నుంచి ఇద్దరు ఉన్నారు.
మార్చి నెల ప్రారంభంలో బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తాజాగా 72 మంది అభ్యర్థులతో పాటు, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి ముందే బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు 267 మంది అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.