జనసేన అధినేత పవన్ కల్యాన్ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నేడు ప్రకటించారు.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన జనసేన 11వ అవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ, లోక్ సభకు పోటీ చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. గతంలో భీమవరం, గాజువాకలో పోటీ చేసిన తాను ఈసారి పీఠాపురం బరిలో దిగుతున్నట్లు చెప్పారు..
2014లో కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలనే దానిపై విజ్ఞప్తులు వచ్చాయని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. కానీ అనంతపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నానని, పార్టీ ఆఫీస్ ను కూడా అనంతపురం నుంచే ప్రారంభించానని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. శక్తి పీఠానికి కేంద్రమైన పిఠాపురం నుంచి బరిలో ఉంటానని పేర్కొన్నారు.
ఎంపీగా పోటీ చేయాలా..? వద్దా…? అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు చెబుతూ ఎంపీగా పోటీ చేయటం పెద్దగా ఇష్టంలేదని, ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తానని వివరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది అధికారం కోసం కాదని, మార్పు కోసం అని స్పష్టం చేశారు.
ఒక ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, అయితే ఓడిపోయాక శూన్యంగా అనిపించిందని తెలిపారు. గతంలో తాను కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించానని, సామాన్యుడికి అండగా నిలవాలన్నదే అప్పుడూ, ఇప్పుడూ తన అజెండా అని వివరించారు. నాడు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపనలో అండగా నిలిచిన వ్యక్తులే ఇవాల జనసేనకు మూలస్తంభాలయ్యారని వెల్లడించారు.
జనసేన పార్టీని 150 మందితో ప్రారంభించామని, నేడు 6.50 లక్షల మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి పార్టీ ఎదిగిందని తెలిపారు. విధానపరంగానే విభేదిస్తాను తప్ప వైసీపీ పై కానీ, జగన్ పై కానీ తనకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదని పవన్ స్పష్టం చేశారు. `మేం తప్ప ఇంకెవడూ బతకకూడదు… మా గుంపే ఎదగాలి’ అంటే కుదరదు అని హితవు చెప్పారు. మీరు మమ్మల్ని తొక్కేస్తామంటే మేమూ మిమ్మల్ని తొక్కేస్తాం అని హెచ్చరించారు.
“నేను ప్రపంచమంతటికీ తెలిసిన పాప్యులర్ నటుడిని కావొచ్చు. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఆ పాప్యులారిటీ అధికారంలోకి బదిలీ కాదు. అందుకే నేను పాతికేళ్లు పనిచేయాలన్న లక్ష్యంతో వచ్చాను. అయితే అఅందుకే నేను పాతికేళ్లు పనిచేయాలన్న లక్ష్యంతో వచ్చాను. అయితే అభిమానులు భిమానులు మాట పడరు” అని తెలిపారు.
“నేను మోదీ గారికి నమస్కారం చేస్తే… నువ్వు ఆయనకెందుకు నమస్కారం చేశావంటారు. మోదీ మహానాయకుడు. ఒక్కోసారి అభిమానం మనల్ని ఎదగనివ్వదు. వైసీపీ నేతలు నిన్ను తిడుతున్నారు. ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి అంటారు” అని పేర్కొన్నారు.
“నేను మీ కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లికోసం వచ్చాను. నా నేల ఇది, నా దేశం ఇది, నా సమాజం ఇది. మా ఇంట్లో వాళ్లు ఎందుకు పాలిటిక్స్? అన్నారు. నేనేమీ చేయకపోయినా దాడులు చేస్తుంటే ఏం చేయాలి? అని వారిని ప్రశ్నించాను” అని వివరించారు.
ఓ దశలో సినిమాలు చేసుకుందాం అనుకున్నాను. కానీ, పనిగట్టుకుని మరీ అత్తారింటికి దారేది సినిమాను ఇంటర్నెట్ లో విడుదల చేశారు. అప్పుడే మా వాళ్లకు చెప్పాను. నన్ను ప్రశాంతంగా బతకనివ్వరు అని. నా ఎదుగుదలే నాకు శాపమైపోయింది. మీ గుండెల్లో ఉన్న అభిమానమే నాకు శాపమైపోయింది. 2014 నుంచి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నాం. జనసేన ఇప్పుడు గుర్తింపు ఉన్న పార్టీగా ఎదిగిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
18 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి మనకు. మనకు 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉండుంటే జనసేన స్థాయి మరోలా ఉండేది. కానీ ఆ రోజున నా వ్యూహాలు ఎవరూ అమలు చేయనివ్వలేదు. నేను వెళితే లక్షలాది మంది జనం వస్తారు కానీ ఆ లక్షలాది మంది ప్రజలు లక్షలాది ఓటర్లు కారు. వారందరూ ఓట్లు వేస్తే పరిస్థితి వేరేగా ఉండేదని చెప్పారు.