అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్, బిజెపిలలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వీరిద్దరూ కాంగ్రెస్ అభ్యర్థులుగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం ఆ పార్టీలో చేరారు. చేవెళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ ను అభ్యర్థిగా బిఆర్ఎస్ ప్రకటించడంతో, తనకు మరోసారి పోటీచేసే అవకాశం ఇవ్వలేదనే అసంతృప్తితో రంజిత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుండి పోటీ చేయాలి అనుకొంటున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేసినా, ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారు. ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఆ సీట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన దానం నాగేందర్ అధికారం కోల్పోయిన పార్టీలో ఉండేందుకు అసహనంగా ఉంటారు. అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరడం ఆయనకు పరిపాటి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ నుండి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బిఆర్ఎస్ నుండి ఇతర పార్టీలలో చేరిన ఎంపీలలో రంజిత్ రెడ్డి ఐదవవారు కావడం గమనార్హం. శనివారమే తనను కాకుండా కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించడంతో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు.
అంతకు ముందు పెద్దపల్లి ఎంపీ బి వెంకటేష్ నాథ్ కూడా కాంగ్రెస్ లో చేరారు.
కాగా, బీజేపీలో ఇద్దరు బిఆర్ఎస్ ఎంపీలు చేరారు. జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్ బిఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరగానే ఆయనను తమ ఎంపీ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. అదేవిధంగా బీజేపీలో నగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తన కుమారుడు భరత్ తో కలిసి చేరగా, భరత్ ను బిజెపి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఇలా ఉండగా, గతం పక్షం రోజులుగా బిఆర్ఎస్ – బిజెపిల మధ్య దాగుడుమూతలు ఆడుతున్న వార్థన్నపేట మాజీ ఎంఎల్ఎ ఆరూరి రమేశ్ చివరకు శనివారం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం బిజెపిలో చేరారు, ఆయన వరంగల్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉంది. బిఆర్ఎస్ ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పార్టీ మారారు.