ఏపీలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్ పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో మోదీ పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీపై విమర్శలు చేశారు.
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు సంకల్పాలు తీసుకోవాలన్న మోదీ కేంద్రంలో ఎన్డీయే సర్కారును ఏర్పాటు చేయటం, రెండోది ఏపీలోని అవినీతి ప్రభుత్వం గద్దెదించడం అని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుబడిందన్న మోదీ ఏపీ అభివృద్ధి కావాలని అనుకుంటే ఎన్డీయే కూటమికి ఓటేయాలని కోరారు. పదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లతో కలిసి రాజకీయ వేదికను పంచుకొన్న ప్రధాని శనివారం ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత ప్రసంగించిన మొదటి ఎన్నికల సభ ఇదే కావడం విశేషం.
బొప్పూడి సభలో కాంగ్రెస్ పార్టీపైనా మోదీ విమర్శలు గుప్పించారు. వారు వాడుకుని వదిలేస్తారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిలో ఒకపార్టీ అంటే మరో పార్టీకి పడదని చెబుతూ ఎన్నికలకు ముందే విభేదాలు బయటపడ్డాయని.. ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని ఎద్దేవా వేశారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీలను కలుపుకుని వెళ్తామన్న మోదీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాడుకుని వదిలేస్తుందని విమర్శించారు.
ప్రజాగళం సభలో ప్రధాని మోదీ.. ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. రాముడన్నా, కృష్ణుడన్నా గుర్తొచ్చేది నందమూరి తారక రామారావేనని చెప్పారు. రాముడు, కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని కొనియాడారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వంద రూపాయల వెండి నాణెం విడుదల చేసినట్లు గుర్తు చేశారు.
తెలుగువారికి కాంగ్రెస్ పార్టీ చేసిన అవమానంతోనే టీడీపీ పుట్టినట్లు మోదీ గుర్తు చేశారు. ఇక ఐదేళ్లలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని మోదీ ప్రస్తావించారు. ఏపీ ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ పథకాల వలన కలిగిన లబ్ధిని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఆశీర్వదించాలని కోరారు.
చంద్రబాబు నాయుడు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని చెబుతూ చంద్రబాబు, పవన్ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వివరించారు.