ఎన్నికల బాండ్లకు సంబంధించిన యునిక్ సీరియల్ నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ నెల 21వ తేదీలోగా తమ వద్ద ఉన్న అన్ని వివరాలను ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారో తెలియజేసే నంబర్లతోపాటు అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు సమర్పించలేదని ఎస్‌బిఐను సుప్రీంకోర్టు నిలదీసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందజేసిన విరాళాలపై ఎస్బిఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
”వివరాలు సమర్పించమని చెప్పండి అప్పుడు చూస్తాం. అన్నట్లుంది మీ వైఖరి. ఎస్బిఐ సెలక్టివ్‌గా ఉండకూడదు. కోర్టుపట్ల నిజాయితీగా వ్యవహరించాలి” అని డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
”ప్రతి సమాచారం వెల్లడి కావాలి. బాండ్ల విషయంలో ఎస్బిఐ సెలెక్టివ్‌గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఎవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్ నెంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బిఐ ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి ” అని ఆదేశించారు.
అన్ని వివరాలను సమర్పించామని పేర్కొంటూ 21వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐని ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన వివరాలను వెంటనే తమ వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకు అన్ని అంశాలను అందించడమే కాకుండా ఎలాంటి సమాచారాన్ని దాచలేదని అఫిడవిట్‌ను కూడా దాఖలు చేయాలని ఎస్‌బిఐని ఆదేశించారు.