రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్‌కు రికార్డు స్థాయిలో 87.8 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తున్నది. 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తేలింది. దీంతో ఆయన ఐదోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.
మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు అదే పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్‌ను అధిగమించనున్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో పుతిన్‌తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. అయితే ప్రధాన ప్రధ్యర్థి అయిన నావల్నీ ఎన్నికలకు ముందే చనిపోవడంతో ఆయనకు అసలు పోటీయే లేకుండా పోయింది.
కాగా, రష్యా ఎన్నికలపై యురోపియన్ యూనియన్ విమర్శలు గుప్పించింది. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని ఫారిన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోర్నెల్ తెలిపారు. ఆ ఎన్నికల్లో అణిచివేత, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. రష్యా ఎన్నికల ఫలితాలపై త్వరలోనే 27 ఈయూ సభ్యదేశాలు సంయుక్త ప్రకటన చేయనున్నాయి.
పుతిన్ నెగ్గింది సూడో ఎలక్షన్ అని జర్మనీ ఆరోపించింది. ఓటింగ్ స్వేచ్ఛగా, న్యాయబద్దంగా జరగలేదని అమెరికా తెలిపింది. అధికార దాహంతో పుతిన్ ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఎన్నటికీ పరిపాలనను తన చేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
అయితే, అమెరికా ప్రజాస్వామ్యం కన్నా రష్యా ప్రజాస్వామ్య బెటర్ అని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతాలైన జపొరిజియా, ఖేర్సన్, డోనస్కీ, లుహాన్స్, క్రిమియాలో కూడా ఓట్లు వేశారు. దేశవ్యాప్తంగా సుమారు 77 శాతం పోలింగ్ జరిగింది.