రానున్న లోక్సభ ఎన్నికల కోసం తమిళనాడులో పాట్టాళి మక్కళ్ కట్చి(పిఎంకె)తో బిజెపి పొత్తు మంగళవారం ఖరారైంది. సీట్ల సర్దుబాటు ఒప్పందంలో భాగంగా తమిళనాడులో 10 లోక్సభ స్థానాలను పిఎంకెకు బిజెపి కేటాయించింది. బిజెపి సారథ్యంలోని ఎన్డిఎలో చేరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను పిఎంకె వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.
దేశ ప్రయోజనాల కోసం, ప్రధాని మోడీ పాలన కొనసాగింపు కోసం ఎన్డిఎ శక్తులతో చేతులు కలపాలని తాము నిర్ణయించుకున్నట్లు పిఎంకె అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, తమిళనాడులో తమ కూటమి భారీ విజయాన్ని అందుకుని ప్రధాని మోడీ మూడవ పర్యాయం బాధ్యతలు చేపట్టేందుకు మార్గాన్ని సుగమం చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాందాస్ నివాసంలో ఎన్నికల పొత్తు ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు వర్గాలు తెలిపాయి. ఎన్డిఎతో కలసి పోటీచేయాలన్న పిఎంకె నిర్ణయం దేశవ్యాప్తంగా 400కి పైగా ఎంపి స్థానాలలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల విజయానికి దారితీయగలదని బిజెపి తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి నుంచి తమిళనాడు మారిపోయిందని, 2024లో తమ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని, 2026లో రాజకీయ మార్పు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ పక్కన డాక్టర్ అన్బుమణి కూర్చోవడం కోసం తాను కోయంబత్తూరు నుంచి ఇక్కడకు వచ్చానని ఆయన తెలిపారు. సేలంలో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభలో పాల్గొనేందుకు పిఎంకె అంగీకరించిందని ఆయన తెలిపారు. పిఎంకెకు 10 లోక్సభ సీట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల పేర్లను త్వరలోనే ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. 2014లో పిఎంకె ఎన్డిఎ కూటమిలో ఉంది.
అమిత్ షాతో రాజ్ థాకరే భేటీ
కాగా, మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ తో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారు కుదిరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. ఇరుపార్టీల మధ్య పొత్తు కుదిరితే ఎంఎన్ఎస్ కు ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. ముంబయితో కొంతపట్టు ఉండటంతో బిజెపి రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమైంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి వంటి పెద్ద పార్టీలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేను కలిగి ఉండి, పెద్దగా ప్రభావం చూపని ఎంఎన్ఎస్ను ఎన్డిఎలో బిజెపి ఎందుకు కోరుకుంటుందనే ప్రశ్నలను ఈ చర్య లేవనెత్తింది.