గ్రామీణ ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమౌతుందని చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నిపుణులైన యువత ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం స్వర్ణభారత్ ట్రస్ట్ లోని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత మెరుగైన భవిష్యత్తును అందుకోగలరన్న ఉపరాష్ట్రపతి, వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దే దిశగా విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, కష్టపడి శ్రమించే తత్వం ఉన్న భారతీయ యువతకు నైపుణ్యశిక్షణను అందించడం ద్వారా, వారు మరిన్ని అవకాశాలను అవలీలగా అందిపుచ్చుకోగలరని తెలిపారు.
ఇదే వేదిక నుంచి చేతన ఫౌండేషన్, రామినేని ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లు, బాలబాలికలకు సైకిళ్ళు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఉపరాష్ట్రపతి అందజేశారు. కష్టపడే పని చేసేవారికి సాయం అందించే ఇలాంటి సంస్థల బాటలో మరింత మంది చొరవ తీసుకోవాలని సూచించారు.
మనం చేసే సాయం ఉపాధిని అందించి కష్టపడేందుకు ప్రోత్సాహం అందిచాలే తప్ప, సోమరులుగా మార్చకూడదని ఉపరాష్ట్రపతి హతవు పలికారు. అన్నీ ఉచితమేనా అనే ఆలోచన సముచితమేనా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేయాలని, ప్రజలకు చక్కని నైపుణ్యాభివృద్ధిని అందించి, వారు నిలదొక్కుకునేందుకు సహకారం అందించాలే తప్ప, ఉచితాలు అలవాటు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదని తెలిపారు.
ఏ స్థాయిలో ఉన్నా, ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తనకు ఎంతో ఆనందం లభిస్తుందన్న ఉపరాష్ట్రపతి, సంతోషమయ జీవనానికి సేవే అత్యుత్తమ సాధనమని తెలిపారు. ఆధ్యాత్మికతలోని అంతరార్ధం సాటి వారికి సేవ చేయడమేనన్న ఆయన, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య సహాయం చేయడం, వసతులు లేనివారికి విద్యాసహాయం చేయడం, ఆపదలో ఉన్నవారికి ధనసహాయం చేయడమనేది సమాజసేవ రూపంలో చేసే ఆధ్యాత్మికసేవ అని పేర్కొన్నారు.
సేవాలయాలే నిజమైన దేవాలయాలన్న ఆయన, సేవ ద్వారా లభించే సంతృప్తికి అవధులు లేవని తెలిపారు. కష్టపడి పని చేసే తత్వం, క్రమశిక్షణ, విషయ పరిజ్ఞానం, ఎదిగిన కొలదీ ఒదిగి ఉండే తత్వం విజయానికి ప్రధానమన్న ఆయన, సకారత్మక ఆలోచనలతో కష్టపడడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని దిశానిర్దేశం చేశారు.
భారతదేశ భవిష్యత్ లో యువత పాత్ర కీలకమన్న ఆయన, ఆరోగ్యకరమైన యువతరం నవభారతాన్ని నిర్మించగలరన్నారు. ఇందుకోసం యువత చైతన్యవంతమైన జీవనశైలి ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, ఆధ్యాత్మిక భావాలతో మానసిక సంతులనాన్ని సాధించాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా ఇవన్నీ సుసాధ్యమని తెలిపారు.
యువత జాతీయ భావాలను కలిగి ఉండాలన్న ఉపరాష్ట్రపతి, సమాజహితం, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ముందుకు సాగడం, ప్రకృతిని పరిరక్షించుకోవడం, కుటుంబవ్యవస్థను పటిష్టం చేసుకోవడం లాంటివి యువత జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు.