ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో మంగళవారం మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్లో న్యాయవాది కోరారు.
తన అరెస్ట్ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించారని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అరెస్ట్ చేశారని కవిత అందులో పేర్కొన్నారు. తన అరెస్ట్ చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆమె చెప్పుకొచ్చారు.
పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు కవిత తెలిపారు. అందుకే ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని, ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆ పిటిషన్లో వివరించారు. కాగా, కవిత ఈడీ కస్టోడియల్ విచారణ మూడో రోజు ముగిసింది. ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్న కవితను అధికారులు విచారించారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మంగళవారం వెనక్కి తీసుకున్నారు. ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ అవసరం లేదని భావించి ఉప సంహరించుకున్నట్లు ఆమె తరఫు లాయర్ తెలిపారు.
కాగా, ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న కవిత సుప్రీంను ఆశ్రయించారు. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని, ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
అయితే, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. మార్చి 24న విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పుడు వాయిదా పడి, చివరకు 27న తొలిసారి ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.
మరోవంక, ఈ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తీస్ హాజరీ కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు. ఆమే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, ఇతర కేసులను విచారించనున్నారు.