రామేశ్వరం కెఫే పేలుడు ఘటనపై వివావాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేసు నమోదైంది. రెండు రాష్ర్టాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఫిర్యాదు మేరకు మదురై పోలీసులు కేసు నమోదు చేశారు. కరంద్లాజే ఇటీవల మాట్లాడుతూ తమిళనాడులో శిక్షణ పొంది, అక్కడ నుంచి కర్ణాటకకు వచ్చిన వ్యక్తులు బాంబులు పెట్టారని ఆమె పేర్కొనడం వివాదంకు దారితీసింది.
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రం గా మండిపడ్డారు. కరంద్లాజే నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తమిళనాడు ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఈవోను ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ఆదేశించింది. కరంద్లాజే ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనపై డీఎంకే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలకు దిగింది.
అయితే తన వ్యాఖ్యలు వివాదం కావడంలో ఆమె బుధవారంనాడు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఈసీ ఆమెపై తాజా చర్యలకు దిగింది. తమిళ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కరంద్లాజే సామాజిక మాద్యమాల వేదికగా క్షమాపణలు తెలియజేసారు.
తాను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్క వర్గాన్ని ఉద్దేశించినవి కావని, కృష్ణగిరిలో శిక్షణ పొందిన నిందితుడిని ఉద్దేశించినవి మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. తన మాటలు కొందరిని బాధించినందున క్షమాపణ తెలియజేస్తు్న్నానని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.