నాటకీయ పరిణామాల మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఇడి) గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో అరెస్లు చేసింది. నిలిపేసిన మద్యం పాలసీ అవినీతి కేసులో ఇడి బలవంతపు చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో దీనిపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఇంతలోనే ఇడి అధికారుల బృందం అయిదు బస్సుల నిండా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్)ను వెంటేసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి, ఆయన నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. ఆ వెంటనే ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం పట్ల దిగ్భ్రాంతికి గురైన ఆప్ శ్రేణులు ఇది చర్యపై ఆగ్రహిస్తూ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు నగరమంతటా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. ఇదిలావుండగా ఇడి సమన్లను సవాల్ చేస్తూ ఆప్ నేత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను జస్టిస్ సురేష్ కుమార్, జస్టిస్ మనోజ్ జైన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం వచ్చే నెల 22కి వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే కేజ్రీవాల్ సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2022 ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. ఈ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని ఈడీ అధికారులు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరు కావాలని ఇప్పటివరకు 9 సార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ వాటిని పట్టించుకోని కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.
స్వతం త్ర భారతదేశ చరిత్రలో అధికారంలో ఉన్న ఒక్క సిట్టింగ్ సిఎంను అరెస్టు చేయడం ఇదే తొలిసారి. ఈ కేసులో గురువారం కూడా కేజ్రీవాల్ ఇడి సమన్లకు అనుగుణంగా ఇడి ఎదుట హాజరు కాలేదు. తనకు అరెస్టు కాకుండా రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు, ఆ తరువాత అత్యవసర ప్రాతిపదికన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ దశలోనే కేజ్రీవా ల్ నివాసంలో ఇడి బృందాలు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించాయి.
వెలుపల జనం గుమికూడటం , భారీ ఉద్రిక్తతల నడుమ కేజ్రీవాల్‌ను ఇడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు ఆయన సతీమణికి విషయం తెలియచేశామని ఇడి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం ఆయనను కోర్టుకు హాజరుపరుస్తామని ప్రకటించారు.
ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి మాట్లాడుతూ,’ కేజ్రీవాల్ అరెస్టు వార్త మాకు అందింది. కేజ్రీవాల్ జైలు నుండి ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ఎప్పటి నుండో చెబుతున్నాం. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. సుప్రీం కోర్టులో కేసు వేశాం. అత్యవసరంగా విచారించాలని మా న్యాయవాదులు కోరారు. ఇడి ఒక దర్యాప్తు సంస్థగా కన్నా బిజెపి చేతిలో రాజకీయ ఆయుధంగా పనిచేస్తోంది’ అని పేర్కొన్నారు.
ఇదే కేసులో ఇంతకుముందు ఆప్ నేతలు సంజరు సిన్హ, ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను అరెస్టు చేసిన ఇడి, గత వారం బిఆర్ఎస్ నేత కవితను అరెస్టు చేసింది.