రష్యా రాజధాని మాస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది. మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి దూసుకెళ్లిన ఆగంతకులు.. కాల్పులకు తెగబడ్డారు. అనంతరం మొత్తం హాల్కే నిప్పంటించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. 100మంది గాయపడ్డారు. మాస్కోలో దాడి తమ పనేనని టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘క్రీస్టియన్స్తో కూడిన భారీ సమూహంపై దాడి చేశాము,’ అని ఓ ప్రకటన విడుదల చేసింది ఇస్లామిక్ స్టేట్.
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, రష్యాపై మరింత పట్టు సాధించిన కొన్ని రోజులేక ఈ దాడి జరగడం గమనార్హం. మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. రష్యాన్ రాక్ బ్యాండ్ ‘పిక్నిక్’ ప్రదర్శనని చూసేందుకు ప్రజలు వెళ్లారు. ఇంతలో ఆగంతుకులు హాల్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు.
ఆ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. చివరికి.. పేలుడు పదార్థాలను కాన్సర్ట్ హాల్లోకి విసిరారు. ఆ తర్వాత.. కాన్సర్ట్ హాల్ రూఫ్ కిందపడిపోయింది. ఇదొక భారీ ట్రాజడీ అని మాస్కో మేయర్ సెర్గే సోబ్యానిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆగంతకుల గురించి ప్రస్తుతం ఎలాంటి వివరాలు లేవు. వారు బతికే ఉన్నారా? లేక మాస్కో కాన్సర్ట్ హాల్ మంటల్లో చిక్కుకుని మరణించారా? అన్నది కూడా తెలియదు.
అయితే.. రష్యా స్పెషల్ ఫోర్స్ వచ్చే ముందే.. దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు పలు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదే నిజమైతే.. దుండగులు ప్రయాణించిన కారును పట్టుకునేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నట్టు అధికారులు చెప్పారు. మాస్కో కాన్సర్ట్ హాల్‌పై దాడికి సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు అధికారులు.
రష్యాలో ఐస్లామిక్ స్టేట్ ప్రభావం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. మార్చ్ 7.. మాస్కోలోని ఓ యూదుల ప్రార్థనా మందిరంపై ఇస్లామిక్ స్టేట్ ప్లాన్ చేసిన దాడిని పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితమే.. ఆరుగురు ఐస్లామిక్ స్టేట్ సభ్యులను.. కౌకసస్ ప్రాంతంలో కాల్చిచంపారు