రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్లో శుక్రవారం జరిగిన ఉగ్రవాద దాడి వెనుక ఉక్రెయిన్ ప్రమేయముందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో శనివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. మాస్కొలోనూ, మాస్కో పరిసర ప్రాంతాల్లోనూ అదనంగా తీవ్రవాద నిరోధక చర్యలు చేపట్టామని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరారు.
ఈ దాడికి పాల్పడిన నలుగురితో సహా మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిలో నలుగురు ఉక్రెయిన్లోకి పారిపోయేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడైందని, దీనితో ఉక్రెయిన్ హస్తం బయటపడిందని పుతిన్ చెప్పారు.
తీవ్రవాదులకు ఆయుధాలు ఎవరు అందచేశారు? వారికి వాహనాలు ఎవరు సమకూర్చారు? తప్పించుకుని పోయే మార్గాలను ఎవరు సిద్ధం చేశారు? వంటి వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారని పుతిన్ తెలిపారు.
మాస్కోలో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతుల సంఖ్య 150కు చేరిందని,150 మంది పైగా గాయపడ్డారని దర్యాప్తు కమిటీ అధికారులు శనివారం తెలిపారు. ఈ దాడి కారణంగా తలెత్తిన మంటలతో దగ్ధమైన భవన శిధిలాల నుండి మరిన్ని మృతదేహాలను అత్యవసర సహాయ బృందాలు వెలికితీస్తున్నాయని చెప్పారు.
దాడి జరిగిన వెంటనే అనుమానితులు సంఘటనా స్థలం నుండి పారిపోయారని, అయితే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారిని సరిహద్దుల్లో పట్టుకున్నారని పేర్కొన్నారు. కాగా ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రకటించింది. అసాల్ట్ రైఫిళ్ళతో వచ్చిన నలుగురు అనుమానితులు శుక్రవారం సాయంత్రం కచేరి జరగడానికి ముందుగా వేదిక వద్దకు దూసుకువెళ్ళారు.
పాయింట్ బ్లాంక్ రేంజ్లో కనిపించిన వారిని కనిపించినట్లు కాల్చారు. తర్వాత గ్రెనెడ్లు విసిరారు. ఆ వెంటనే భవనంలో మంటలు, నల్లని దట్టమైన పొగ కమ్ముకున్న వీడియోలు బయటకు వచ్చాయి. మంటలను అదుపు చేయడానికి మూడు హెలికాప్టర్లను ఉపయోగించారు.
కాగా, రష్యాపై ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ విషాద సమయంలో రష్యాకు బాసటగా ఉం టామన్నారు. అత్యంత హీనమైన పిరికి చర్యగా రష్యాపై ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. పలు దేశాలు దాడిని తీవ్రంగా ఖండించి, రష్యన్లకు సానుభూతి ప్రకటించాయి.
ఉగ్రదాడికి సంబంధించి మరిన్ని వివరాలు శనివారం వెల్లడయ్యాయి. వాటి ప్రకారం.. మాస్కో శివార్లలోని క్రాస్నొగొర్స్క్ ప్రాంతంలో ఉన్న క్రాకస్ సిటీ హాల్లో సోవియట్ యూనియన్ కాలం నాటి ‘పిక్నిక్ రాక్బాండ్’ సంగీత కార్యక్రమాన్ని తిలకించటానికి శుక్రవారం వందలాది మంది తరలివచ్చారు.
ఆ హాల్లో 6,200 మంది కూర్చోగల సామర్థ్యం ఉంది. కొద్దిసేపట్లో మ్యూజిక్ షో ప్రారంభమవుతుందనగా.. రాత్రి 7.40 గంటలకు సైనిక దుస్తులు ధరించిన నలుగురు ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులతో ఓ మినీవ్యాన్లో వచ్చారు. వచ్చీరాగానే హాల్లోకి ప్రవేశించి అమాయక జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు.
హాలును తగలబెట్టటానికి మంటలను పుట్టించే ద్రావకాన్ని కుర్చీలపై, కర్టెయిన్లపై వెదజల్లారు. మంటలు క్షణాల్లో ఎగిసిపడ్డాయి. జనం కకావికలమై.. ప్రాణాలు రక్షించుకోవటానికి పరుగులు తీశారు. పారిపోతున్న జనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. హాలుపై అంతస్తులో కూర్చున్న వారు ఈ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో రికార్డు చేశారు.
ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉగ్రవాదుల కాల్పులతోపాటు, హాలులో పొగ దట్టంగా అలుముకోవడంతో ఊపిరాడక కూడా చాలామంది మరణించి ఉంటారని పేర్కొన్నారు. కాగా, దాడి నేపథ్యంలో మాస్కో నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులకు రక్తదానం చేయటానికి మాస్కో వాసులు ఆసుపత్రుల ముందు బారులు తీరి మానవత్వం చాటుకున్నారు.