లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటికే.. నాలుగు విడతల్లో మొత్తం 291 అభ్యర్థులను ప్రకటించిన బిజెపి ఆదివారం సాయంత్రం ఐదో జాబితా కూడా విడుదల చేసింది. తొలి విడతలో ఒకేసారి 195 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన బీజేపీ, రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను, మూడో జాబితాలో కేవలం 9 మంది అభ్యర్థులను, 15 మంది పేర్లతో నాలుగో లిస్టును ప్రకటించింది.
ఇక ఇప్పుడు ఐదో జాబితాను ప్రకటించిన బీజేపీ.. ఈ జాబితాలో ఏకంగా 111 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 402 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అయితే.. ఇప్పటికే ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల్లో పలువురు సినీ నటులు ఉండగా, ఐదో జాబితాలోనూ సినీ గ్లామర్ ఉండేలా జాగ్రత్తపడింది బీజేపీ.
హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి హీరోయిన్ కంగనా రనౌత్‌ను రంగంలోకి దించుతోంది కమలం పార్టీ. మరోవైపు.. రామయణంలోని రాముని పాత్రదారుడైన అరుణ్ గోవిల్‌కు కూడా టికెట్ ఇచ్చింది కమలం పార్టీ. యూపీలోని మీరట్ నుంచి అరుణ్ గోవిల్‌ను పోటీకి దించుతోంది బీజేపీ.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పోటీ చేయనున్న కేరళలోని వాయనాడ్ స్థానానికి బిజెపి అభ్యర్థిగా కె సురేంద్రన్ను ఎంపిక చేశారు. కురుక్షేత్ర (హర్యానా) నుంచి నవీన్ జిందాల్, బెల్గామ్ (కర్నాటక) నుంచి తిరిగి ఇటీవలనే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టార్ పోటీ చేయనున్నారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగూలీకి బెంగాల్లో తామ్లుక్ సీటును బిజెపి కేటాయించింది. టిఎంసి నుంచి ఇటీవల బిజెపిలో చేరిన అర్జున్ సింగ్, తపస్ రాయ్‌లకు వరుసగా బారక్పూర్, కోల్‌కతా నార్త్ సీట్లను కేటాయించింది.
ఐదో జాబితాలో ఉజియార్పూర్ నుంచి నిత్యానంద్ రాయ్, బెగుసరాయ్ నుంచి గిరిరాజ్ సింగ్, పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, దుమ్కా నుంచి సీతా సోరెన్, బెల్గాం నుంచి జగదీశ్ షెట్టర్, బెల్గాం నుంచి జగదీశ్ షెట్టర్, ఢారంభళ్లాపూర్ నుంచి కే సుధాకరన్ బరిలోకి దిగారు.
సంబల్పూర్, బాలాసోర్ నుండి ప్రతాప్ సారంగి, పూరీ నుండి సంబిత్ పాత్ర, భువనేశ్వర్ నుండి అపరిజిత సారంగి, మీరట్ నుండి అరుణ్ గోవిల్, ఇతర అభ్యర్థులలో ఉన్నారు. ఇతర అభ్యర్థులలో జునాగఢ్ నుండి రాజేష్ చుడాసమా, మెహసానా నుండి హరి పటేల్, సబర్కాంత నుండి షబ్నా బెన్ బరియా, వడోదర నుండి డాక్టర్ హేమాంగ్ జిషి, అమ్రేలీ నుండి భరత్ భాయ్ సుతారియా, సురేంద్రనగర్ నుండి చందూభాయ్ షియోహోరాలను పార్టీ ప్రకటించింది.
వడోదర, సబర్కాంత అభ్యర్థులను బీజేపీ మార్చి.. మళ్లీ ప్రకటించింది. ముందుగా పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను ఈరోజు ముందుగానే వెనక్కి తీసుకుంది. వడోదర నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ పొందిన రంజన్‌బెన్ భట్ వ్యక్తిగత కారణాలను చూపుతూ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.
ఆమె రెండుసార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా ఆమెకు టికెట్ దక్కడంతో ఆమె వ్యతిరేక వర్గం పెద్ద ఎత్తున పోస్టర్ల యుద్ధాన్ని ప్రారంభించింది. దీంతో ఆమె పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని, అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇచ్చినా, వారి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.
గుజరాత్‌లోని శబర్కాంత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్న బీజేపీ నేత భికాజీ ఠాకూర్ కూడా కాడి కింద పడేశారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ, పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఆయన మాజీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఓబీసీ నేత, 34 ఏండ్ల నుంచి బీజేపీలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఆయనకు మొదటిసారి లభించింది.
ఇక మెహసానా లోక్‌సభ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మొదట కోరారు. కానీ ఆ తర్వాత ఎటువంటి కారణం చూపకుండానే తాను పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీ ఈ స్థానం నుంచి పోటీ చేసేవారి పేరును ప్రకటించడానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.