దశాబ్దాలపాటు రెండు రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను ఎట్టకేలకు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. వీరప్పన్ గురించి చాలా సినిమాలు వచ్చాయి. అయితే వీరప్పన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వీరప్పన్ రెండో కుమార్తె విద్యా రాణి వీరప్పన్ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె సోమవారం తన నామినేషన్ కూడా దాఖలు చేశారు.
విద్యా రాణి తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి, ఆమె రాష్ట్ర ఓబిసి విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఆమె తాజాగా నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే)లో చేరారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి పార్టీ తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి స్థానంలో కూడా పోటీ చేస్తుంది.
విద్యా రాణి మూడో తరగతి చదువుతున్న సమయంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని గోపీనాథమ్ గ్రామంలోని తాతయ్య ఇంట్లో తన తండ్రి వీరప్పన్ను కలిసినట్లు చెప్పారు. తను వీరప్పన్ను కలవడం అదే మొదటి సారే కాదు చివరి సారి అని విద్యా రాణి భావోద్వేగానికి గురయ్యారు.
విద్యా వాణి వృత్తి రీత్యా న్యాయవాది. అంతే కాకుండా ఆమె కృష్ణగిరిలో ఒక పాఠశాలను కూడా నడుపుతున్నారు. తన తండ్రి వీరప్పన్ కలిసినప్పుడు జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యా రాణి చెప్పారు.