* 12 మంది సైనికుల మృతి?
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. దేశంలోని రెండో అతిపెద్ద నేవల్ ఎయిర్‌స్టేషన్ పీఎన్ఎస్ సిద్ధిఖ్‌పై గతరాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది భద్రతాధికారులు మరణించినట్టు తెలుస్తున్నా స్పష్టత లేదు. దాడితో అప్రమత్తమైన సైనికులు, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు.
ఈ ఘటనలో ఎయిర్ స్టేషన్‌కు ఎలాంటి నష్టమూ జరగలేదని, ముష్కరులు లోపలికి వస్తుండగానే మట్టుబెట్టామని అధికారులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ) ప్రకటించింది. తమ కాల్పుల్లో 12 మంది పాక్ సైనికులు మరణించారని పేర్కొంది.
ఈ నెల 20న గ్వాదర్ పోర్టుపై దాడికి పాల్పడిన తీవ్రవాదులు అంతలోనే నేవీ ఎయిర్‌స్టేషన్‌పై దాడికి దిగారు. గ్వాదర్‌పై జరిగిన దాడి ఘటనలో ఏడుగురు ముష్కరులు హతమయ్యారు. బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం సంపాదించి పెట్టడమే లక్ష్యంగా పలు గ్రూపులు పనిచేస్తున్నాయి. అందులో బీఎల్ఏ ఒకటి.
దీనిని అమెరికా, యూకేతోపాటు పాకిస్థాన్ కూడా ఉగ్ర సంస్థగా గుర్తించింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌ను బలూచిస్థాన్‌లోని వేర్పాటువాద గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడి గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాకిస్థాన్ దోపిడీ చేస్తున్నాయనేది బీఎల్ఏ ఆరోపణ.