అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఓ భారీ కంటేనర్ బోటు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. పటాపస్కో నదిపై నిర్మించిన బ్రిడ్జ్‌ను ఓ భారీ నౌక ఢీకొట్టింది. సింగపూర్ జెండాతో ఆ నౌక ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.
ఆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. నౌక ఢీకొన్న సమయంలో గల్లంతైన వారు మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. నౌక ప్రయాణిస్తున్న సమయంలో పవర్ పోయిందని, దాంతో ఆ నౌక బ్రిడ్జ్‌ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. బ్రిడ్జ్‌పై రిపేర్ వర్క్ చేస్తున్న ఆరుగురు గల్లంతైన్నట్లు గుర్తించారు.
అయితే, ప్రధాన వంతెనను ఢీకొట్టి కింద నదిలో పడిపోయిన కార్గో నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ తెలిపింది. ఇద్దరు పైలట్లు సహా సిబ్బందిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని షిప్ మేనేజ్ మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
బాల్టిమోర్ నుంచి ఆ నౌక శ్రీలంకలోని కొలంబోకు వెళ్తున్నది. ఆ నౌకకు దాలి అన్న పేరున్నది. బ్రిడ్జ్‌కు చెందిన అన్ని లేన్లను మూసివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను మరో వైపు మళ్లించారు. ఏడు మందితో పాటు ఏడు వాహనాలు బ్రిడ్జ్ కూలిన సమయంలో నదిలో పడినట్లు బాల్టిమోర్ సిటీ ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి చెందిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పాక్షికంగా కూలిపోవడంతో, ఆ సమయంలో ఆ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్నవారిని కాపాడేందుకు కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగారు. ఇద్దరు ప్రయాణికులను రక్షించినట్లు కోస్ట్ గార్డ్స్ ప్రకటించింది. అయితే, ఎన్ని వాహనాలు నదిలో పడిపోయాయి? వాటిలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు.
కానీ, పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. వంతెన కుప్పకూలడంతో ఆ బ్రిడ్జి వైపు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. దాంతో, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఒక్కసారిగా నిలిచిపోయింది. మంగళవారం తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో పటాప్స్కో నదిపై ఒక సరకు రవాణా నౌక అదుపుతప్పి బాల్టిమోర్ వంతెన పిల్లర్ ను ఢీకొన్నది. దాంతో, బాల్టిమోర్ వంతెన ఒక్కసారిగా, పాక్షికంగా కూలిపోయింది. మరోవైపు, వంతెనను ఢీ కొన్న తరువాత ఆ సరకు రవాణా నౌకలో మంటలు చెలరేగాయి.