బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ లోనే ఫిలిబిత్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టిపడింది. ఈ పర్యాయం ఆయనకు బిజెపి సీటు నిరాకరించి, కాంగ్రెస్ నుండి వచ్చిన యుపి మంత్రి జితిన్ ప్రసాదను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన మౌనం పాటిస్తున్నారు. ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
దానితో వరుణ్ గాంధీ పార్టీ నిర్ణయానికి తలవంచి ఎన్నికలకు దూరంగా ఉంటారా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? మరేదైనా పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తారా? అనే ప్రశంలు తలెత్తుతున్నాయి. మరోవైపు వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి మాత్రం బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. యూపీలోని సుల్తాన్‌పుర్ నుంచి మరోసారి బరిలోకి దింపింది.
గత నాలుగు పర్యాయాలుగా ఫిలిబిత్ నియోజకవర్గంలో బీజేపీ గెలుస్తూ వస్తున్నది. దాదాపు మూడు దశాబ్దాలుగా గాంధీ కుటుంబం ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నది. వరుణ్ గాంధీ ఇక్కడి నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు. అంతకు ముందు ఆయన తల్లి మేనకా గాంధీ ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు.
2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఇటువంటి సమయంలో వరుణ్‌ను తమ పార్టీలో చేరమని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడం ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మంగళవారం మాట్లాడుతూ వరుణ్ గాంధీ వస్తే తాము స్వాగతిస్తామని ప్రకటించారు. గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్న కారణంగా ఆయనకు బిజెపి టికెట్ నిరాకరించిందని ఆరోపించారు.
‘వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లోకి వస్తే మేం ఎంతో సంతోషిస్తాం. అతను విద్యావంతుడు. క్లీన్ ఇమేజ్ కలిగిన వ్యక్తి. కానీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో బిజెపి టికెట్ నిరాకరించింది. అందుకే ఆయనను మేం సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం’ అని అధిర్ రంజన్ తెలిపారు.