రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ కన్నుమూశారు. 95 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం రాత్రి 8.14 గంటలకు స్మరణానంద తుదిశ్వాస విడిచినట్టు రామకృష్ణ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
జనవరి 29న మూత్రనాళం ఇన్ఫెక్షన్తో స్వామి స్మరణానంద రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ (ఆస్పత్రి)లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించి, శరీరంలో ఒక్కో అవయవం దెబ్బతింది. మార్చి 3 వరకూ స్వామీజీ వెంటిలేటర్‌పై ఉన్నారు. రామకృష్ణ మిషన్, మఠానికి 17వ అధ్యక్షుడిగా 2017లో స్వామి స్మరణానంద బాధ్యతలు స్వీకరించారు. బుధవారం బేలూరు మఠంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
2017లో స్వామి స్మరణానంద మహరాజ్ 16వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మిషన్ నిర్వహిస్తున్న దక్షిణ కోల్ కతా ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. ఈ ఏడాది మార్చి 5న రెండోసారి బెంగాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన మరణానంతరం ప్రధాని ఎక్స్ లో ఒక సందేశంలో తన సంతాపాన్ని తెలియజేశారు.
‘రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ గౌరవనీయ అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహరాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు, సేవకు అంకితం చేశారు. లెక్కలేనన్ని హృదయాలు, మనసులపై చెరగని ముద్ర వేశారు. ఆయన కరుణ, వివేకం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. కొన్నేళ్లుగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. 2020లో బేలూరు మఠానికి వెళ్లినప్పుడు ఆయనతో మాట్లాడాను. కొన్ని వారాల క్రితం కోల్ కతాలో కూడా ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశాను. బేలూరు మఠంలోని అసంఖ్యాక భక్తులతో నా ఆలోచనలు ఉన్నాయి. ఓం శాంతి’ అని మోదీ ట్వీట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సంతాపం తెలిపారు. ‘రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ గౌరవనీయ అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానందజీ మహరాజ్ మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు ఓదార్పు వనరుగా ఉన్నారు. ఆయన తోటి సన్యాసులు, అనుచరులు, భక్తులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను..’ అని పేర్కొన్నారు
శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహరాజ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.