ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. ఆయనను మరోసారి ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగియగా గురువారం ఉదయం ఈడీ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.
ఈ సందర్భంగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్ మరోసారి కేజ్రీవాల్‌కు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. దీంతో ఆయనను మళ్లీ ఈడీ ప్రధాన కార్యాలయానికి అధికారులు తరలించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వ తేదీ వరకు పొడగిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. విచారణలో కేజ్రీవాల్ తప్పించుకునే రీతిలో సమాధానాలు చెబుతున్నారని కోర్టులో ఈడీ ఆరోపించింది.
కేజ్రీవాల్ భార్యకు సంబంధించిన సెల్‌ఫోన్‌ను సీజ్ చేశామని.. ఆ ఫోన్, లోని డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన మార్చి 21 వ తేదీన ఆయన నివాసంలో స్వాధీనం చేసుకున్న 4 సెల్ఫోన్ల నుంచి ఇంకా డేటా సేకరణ పూర్తి కాలేదని పేర్కొంది.
అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తన లాయర్లను సంప్రదించిన తర్వాత ఆ సెల్ఫోన్ల పాస్వర్డ్లు, లాగిన్ డీటెయిల్స్ అందిస్తానని చెప్పాడని, అందుకు సమయం కోరినట్లు ఈడీ విన్నవించింది. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ కుట్రలో భాగమని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దీనికి సమాధానం ప్రజలే ఇస్తారని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చిన సందర్భంగా ఈడీ కస్టడీ పొడగింపు తర్వాత కేజ్రీవాల్ మీడియాకు వెల్లడించారు.
అయితే కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని, ఈ సందర్భంగా ఆయనను గోవా ఎమ్మెల్యేలతో కలిసి విచారణ జరపాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అందుకు సమయం పడుతుందని.. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్‌ను మరో 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ లాయర్ వాదించారు. అయితే ఇది తప్పుడు కేసు అని కేజ్రీవాల్ ఆరోపించారు. రెండు వైపులా వాదనలు విన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి.. ఈడీ కస్టడీని పొడగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇలా ఉండగా, మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సుర్జీత్ సింగ్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఏ అధికారి కింద సీఎంగా కొనసాగుతున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్లను వివరణ కోరాలని పిటిషనర్ కోరారు.
ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రిని పదవిలో కొనసాగనివ్వకూడదని పిటిషనర్ సుర్జిత్ యాదవ్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు ఆటంకాలు కలుగుతుందని.. దాంతో న్యాయ ప్రక్రియను అడ్డుకోవడమే మాత్రమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేస్తుందని ఆయన ఆరోపించారు.
అయితే, కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించలేమని.. జైలు నుంచి పాలన కొనసాగించడాన్ని అడ్డుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్‌ప్రీత్ సింగ్ అరోరా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ పిటిషన్‌ను పిటిషన్‌ను తిరస్కరించింది.