* వామపక్షాలకూ నోటీసులు
కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18 అలాగే 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్ల డిమాండ్ నోటీసులు ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
కాగా తమపై ఐటీ శాఖ ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నది. లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని వివేక్ తంఖా ఆరోపించారు. ఈ విషయంలో చట్టపరంగా పోరాడుతామని చెప్పారు. ఐటీ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
ఆదాయ పన్ను శాఖ నుంచి తాజాగా అందని నోటీసులపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ శుక్రవారం ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఎన్నికల ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ఈ పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాజా నోటీసులపై పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్‌తో కలిసి జైరాం రమేశ్ బీజేపీ పన్ను చట్టాలను ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ నుంచి రూ.4600 కోట్లు వసూలు చేయాలని తెలిపారు.
కాగా, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. గత కొన్నేళ్లుగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు పాత పాన్‌కార్డును ఉపయోగించినందుకు రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి నోటీసులివ్వగా.. అదే కారణాన్ని చూపుతూ సీపీఎం కూడా రూ. 15.59 కోట్లు చెల్లించాలంటూ నోటీసులిచ్చారు.
గడిచిన 72 గంటల్లో ఐటీ శాఖ నుంచి తనకు 11 నోటీసులు వచ్చాయని, ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చే యత్నాల్లో భాగంగానే ఇది జరుగుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే శుక్రవారం తెలిపారు. ఎక్స్ ఖాతాలో ఈ మేరకు ఆయన పోస్ట్ పెట్టారు.