లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ వల్ల జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుండే 2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఆరు హామీలను ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం జరిగిన ప్రతిపక్షాల కూటమి ‘లోక్తంత్ర బచావో’ బహిరంగసభలో ఆయన చేసిన ఆరు హామీలను ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు.
దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, దేశంలో పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామం, మొహల్లాకు మంచి ప్రభుత్వ పాఠశాల, మొహల్లా క్లినిక్, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు.
గడిచిన 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తి స్థాయి రాష్ట్రహోదా కల్పిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నట్టు సునీత వెల్లడించారు. విద్య, వైద్యంతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, విపక్ష కూటమికి అవకాశం కల్పిస్తే గొప్ప దేశాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు.
భారతమాత ఇబ్బందుల్లో ఉందని, ఈ దౌర్జన్యం పనిచేయదని, సునీత స్పష్టం చేశారు. తన భర్తకు దేశ వ్యాప్తంగా ఎంతో మద్దతు లభిస్తోందని పేర్కొంటూ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన సభలో భావోద్వేగ ప్రసంగం చేసిన సునీత, కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దేశ ప్రజలు కేజ్రీవాల్ తోనే ఉన్నారని, ఆయనను ఎప్పటికీ జైళ్లోనే ఉంచలేరని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పంపిన సందేశం లోని ఆరు గ్యారంటీలను వెల్లడించారు.
“దేశ వ్యాప్తంగా కరెంట్ కోతలు ఉండవు, పేదలకు ఉచిత విద్యుత్ అమలు, సమాజం లోని అన్ని వర్గాల కోసం నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి గ్రామంలో మంచి పాఠశాల, ప్రతి గ్రామం లోనూ మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, స్వామినాథన్ నివేదిక ఆధారంగా రైతుల పంటలకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పిస్తాం ” అని కేజ్రీవాల్ తన సందేశంలో పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని చెప్పారు.