సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న సంజయ్ సింగ్ గత ఏడాది అక్టోబర్‌లో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో సోదాలను నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని నెలల పాటు ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. విచారణను ఎదుర్కొన్నారు.
గతంలో పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా, పీబీ వరలేతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం వాదనలను ఆలకించింది.
ఇన్ని రోజుల పాటు సంజయ్ సింగ్ ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఎలాంటి సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు సేకరించలేకపోయినట్లు ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు.
ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు తన వాదనలను వినిపించారు. మద్యం వ్యాపారి దినేష్ అరోరా నుంచి సంజయ్ సింగ్‌కు రెండు కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయని ఎస్ వీ రాజు తెలిపారు. ఇందులో ఆయన ప్రమేయం ఉందని, విచారణ మరింత లోతుగా సాగాల్సి ఉందని చెప్పారు. దానికి కొంత గడువు కావాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ సింగ్ ప్రమేయం ఉందని నిరూపించేలా ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా లేవని చెప్పారు. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ఆదేశించారు. బెయిల్‌పై ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గన వచ్చనీ పేర్కొన్నారు.