చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకుడు గెలువకూడదనే తాను కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. ఆమెను కడప లోక్ సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించిన వెంటనే కడపలో మీడియాతో మాట్లాడుతూ తన మరో బాబాయి కుమారుడు, ప్రస్తుత ఎంపీ, అన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడైన వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేయాల్సి రావడం పట్ల భావోద్వేగంకు గురయ్యారు.
ఈ పోటీ కారణంగా తాను ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, తన కుటుంభంలో చీలికకు దారి తీస్తుందని, పైగా నాన్న వైఎస్ అభిమానులను గందరగోళంకు గురిచేస్తోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. అయితే, చిన్నాన్న వైఎస్ వివేకానందాను హత్య చేయించిన వాళ్లను అన్న జగన్ వెనకేసుకొస్తున్నారని, హంతకులను కాపాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకాను చంపించిన అవినాష్ కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయానని తెలిపారు. గత ఎన్నికల్లో వివేకా హత్యను వైసీపీ రాజకీయం కోసం వాడుకుందని, విమర్శించారు. తాను కడప ఎంపీగా నిలబాలనేది వివేకా చివరి కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా పోటీలో దిగుతున్నానని ఆమె స్పష్టం చేశారు. హంతకుడు అవినాష్‌ను ఎంపీ కానివ్వకపోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
అయితే, తన అన్న వైఎస్ జగన్ పై తనకు ఎటువంటి ద్వేషం లేదని, పైగా గత ఎన్నికల సందర్భంగా తనను చెల్లెలుగా కాకుండా ఓ బిడ్డగా పేర్కొన్నారని ఆమె గుర్తు చేశారు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అన్నా మారిపోయారని, ఇప్పుడు ఆయన ధోరణి తనకే అర్ధం కావడం లేదని ఆమె పేర్కొన్నారు.
“కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా పోటీ చేయాలనే నిర్ణయం సులువైంది కాదని నాకు తెలుసు. కుటుంబం నిలువునా చీలుతుందని తెలిసినా కూడా ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆమె చెపాప్రు. నా అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని, జగనన్న హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని ఆమె మండిపడ్డారు. చిన్నాన్న వివేక్ హత్యకు సంబంధించిన వాస్తవాలు అప్పట్లో తనకు తెలీయవని, ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉండడంతో తట్టుకోలేక పోతున్నానని ఆమె తెలిపారు.
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ అధిష్ఠానం తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేయగానే ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె నివాళులు అర్పించారు. తన రాజకీయ ప్రవేశ లక్ష్యాన్ని నెరవేర్చాలని అమ్మ విజయమ్మ కన్నీటితో ప్రార్థన చేసి ఆశీర్వదించారని ఆమె తెలిపారు.