చత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో 13 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బీజాపూర్ జిల్లాలో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి.
జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. తాజా ఎన్కౌంటర్లో డీవీసీ మెంబర్ క్రాంతి ముచతోపాటు మరో కీలక సభ్యుడు పాపారావు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. మావోయిస్టులు భారీ సంఖ్యలోనే గాయపడ్డట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి.
గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని లెండ్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కాల్పుల పోరు జరిగింది. నక్సల్స్ కోసం గాలింపు చేపట్టిన భద్రతా సిబ్బంది తమపై కాల్పులకు తెగబడిన నక్సల్స్‌పై ఎదురుకాల్పులు జరిపారని బస్తర్(రేంజ్) ఐజి సుందర్రాజ్ తెలిపారు.
కాల్పుల పోరు ఆగిన తర్వాత భద్రతా సిబ్బంది గాలింపు జరపగా నలుగురు నక్సలైట్ల మృతదేహాలతోపాటు ఒక తేలికపాటి మిషన్ గన్, బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆ యుధాలు, మందుగుండు లభించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్ర దేశం వద్ద మరో ఐదు మృతదేహాలు లభించాయని ఆయన చెప్పారు.
ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఐజి తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జిల్లా రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, దాని ఎలైట్ యూనిట్ కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా) పాల్గొన్నాయని ఐజి తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి కాలంలో మార్చి, జూన్ మధ్య నక్సలైట్లు టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్(డిసిఓసి) నిర్వహించి తమ కార్యకలాపాలను ఉధృతం చేస్తారు. ఈ కాలంలోనే బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలపై పెద్ద సంఖ్యలో దాడులు జరిగాయి.
మార్చి 27న బీజాపూర్‌లోని బసగూడ ప్రాంతంలో భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఆరుగురు నక్సలైట్లు మరణించారని పోలీసులు ఇదివరకు తెలిపారు. తాజా ఘటనతో కలిపి బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇప్పటి వరకు భద్రతా దళాల ఎదురుకాల్పులలో 45 మంది నక్సలైట్లు మరణించారు. బస్తర్ ప్రాంతంలో బీజాపూర్‌తో కలుపుకుని ఏడు జిల్లాలు ఉన్నాయి.