‘‘అప్పటి ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కేసీఆరే ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యత వహించాలి. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగే అవకాశం లేదు. రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంలో కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, అందుకే ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరతామని తెలిపారు.
దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం, గవర్నర్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు. అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఒకవైపు రాజకీయ లబ్ధి కోసం, మరోవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు దోపిడీ చేసేందుకే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపించారు.
రిటైర్డ్ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి, ఆయన నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని తెలిపారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ అత్యంత సీరియస్ విషయం. పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. కేంద్ర ఎన్నికల సంఘ నియమాలను కేసీఆర్ ప్రభుత్వం యధేచ్ఛగా ఉల్లంఘించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసు అధికారులే వెల్లడించారని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కి, అధికార యంత్రాంగాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేలా వ్యవహరించింది. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ గుర్తింపుపై పునరాలోచన చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫాంహౌజ్ ఫైల్స్ పేరిట కేసీఆర్ డ్రామా నడిపారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఈ డ్రామాకు సూత్రధారి, దర్శకత్వం, నిర్మాత కేసీఆర్. పాత్రధారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి వీడియో ప్రదర్శించారు. ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌పై చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఆధారం ఇంకేం కావాలి?’’ అని నిలదీశారు. బీఆర్ఎస్ గుర్తింపు రద్దుపై ఎన్నికల సంఘం తక్షణం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.