“మన రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ హత్యా రాజకీయాలను స్వస్తి పలకాలన్న జగనన్నగారిని, అవినాశ్ రెడ్డి ఓడించాలి” అని పిలుపిస్తూ ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఏపీ న్యాయయాత్ర పేరిట శుక్రవారం కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం అమగంపల్లెలో బస్సుయాత్ర ప్రారంభించారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే, ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.
“ఓవైపు ధర్మం వైపు కోసం పోరాడే నేను నిలబడ్డాను. అటువైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. న్యాయం అన్నది గెలవాలంటే ప్రజలు నిలబడాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. పోలవరం పూర్తి కావాలన్నా, స్టీల్ ప్లాంట్ పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలి. రాజశేఖర్ రెడ్డి ఉంటే స్టీల్ ప్లాంట్ ఇలాగే ఉండేదా..? ” అంటూ ఆమె ప్రశ్నించారు.
‘సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని చంపినవారిని శిక్షించలేని నీవు నాయకుడివి ఎలా అవుతావు?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయన సోదరి షర్మిల విరుచుకుపడ్డారు. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని కాపాడుతున్నాడని, హత్య చేసినవారికే మళ్లీ పార్టీ టికెట్ ఇచ్చాడని, న్యాయం, ధర్మం ఎక్కడుందని ప్రశ్నించారు.
ఈ ఘోరాన్ని ఆపడానికే వైఎస్సార్ బిడ్డగా తాను ఎంపీగా నిలబడ్డానని, ఇది న్యాయానికి, అధర్మానికి జరుగుతున్న పోరాటమని ఆమె చెప్పారు. తనవైపు న్యాయముందని, మరోవైపు వివేకా హత్య కేసు నిందితుడు, అధర్మం, అధికారం, డబ్బు ఉన్నాయని, ఎవరిని గెలిపిస్తారో ప్రజలే నిర్ణేతలని ఆమె తెలిపారు.
తొలిరోజు కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మీదుగా బస్సుయాత్ర సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపి ఐదేళ్లు గడిచినా నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు అవినాశే అని సీబీఐ చెప్పిందని, ఫోన్‌కాల్స్, రికార్డులు, గూగుల్ మ్యాప్స్ ఇదే చెబుతున్నాయని, అయినా కేసు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆమె ధ్వజమెత్తారు. ఒకరోజు కూడా అవినాశ్ జైలుకు పోలేదని, అధికారం అడ్డుపెట్టుకుని బయట తిరుగుతున్నాడన్నారని ఆరోపించారు.
‘జగన్ రాష్ట్రానికే కాదు సొంత జిల్లాకు మంచి చేయలేదు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదు. పార్లమెంటు, రాజ్యసభ కలుపుకొని వైసీపీకి 31 మంది ఎంపీలున్నారు. ఒక్కరోజు కూడా విభజన హామీల గురించి ప్రశ్నించలేదు. వివేకా హత్య ఎవరు చేయించారో అందరికీ తెలుసు. అయినా నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇది న్యాయమేనా, ధర్మమేనా..?” అంటూ షర్మిల ప్రశ్నించారు.
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలు రామలక్ష్మణుల్లా ఉండేవారు. నాన్న చివరి కోరిక షర్మిలను ఎంపీ చేయాలని. నాన్నను చంపిన వారికే మళ్లీ జగన్ సీటు ఇచ్చారు. హత్యారాజకీయాలు వద్దు. వైఎస్ వివేకా మన మధ్య లేరు. ఆయన వద్దకు ఎప్పుడు పోయినా పలికేవారు. కడప ఎంపీ సీటు కోసం ఆయనను కిరాతకంగా హత్య చేశారు” అంటూ వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
“ఈ పని చేయించింది ఎంపీ అవినాశ్‌రెడ్డి. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నారు. ఎంపీ సీటు షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. అవినాశ్ వద్దని చెప్పారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నాడు. వారికి శిక్ష పడాలంటే అవినాశ్‌ను ఓడించాలి’’ అని డాక్టర్ సునీత స్పష్టం చేశారు.