పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. కూతురు జైలుకు వెళ్లింది, కాలు విరిగిందని ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదని చెబుతూ మాజీ సిఎం కెసిఆర్ భాష సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం జనజాతర సభలో రేవంత్ ప్రసంగిస్తూ కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఇకపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తాను జానారెడ్డిని కాదని, రేవంత్రెడ్డినంటూ సిఎం పేర్కొన్నారు. 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారని, జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషకరమని చెప్పారు.
బిఆర్ఎస్ను ఓడించినట్లే దేశంలో బిజెపిని ఓడించాలని సిఎం పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదని, బిఆర్‌ఎన్‌ను తుక్కుతుక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ జండా ఎగురబోతుందని సిఎం రేవంత్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతుందని, ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ జోస్యం చెప్పారు.
మహిళలు ఆర్థికంగా బలపడితే దేశ ముఖచిత్రమే మారుతుందని.. అందుకే కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాహుల్ గాంధీ తెలిపారు. జాతీయస్థాయి కాంగ్రెస్ మేనిఫెస్టోను ఈ సందర్భంగా విడుదల చేస్తూ కొద్ది నెలల క్రితం ఇక్కడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించామని.. ఇప్పుడు జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించేందుకు వచ్చానని చెప్పారు.
రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. దేశంలోనూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. మహిళలకు న్యాయ్ పేరుతో దేశంలో ప్రతి నిరుపేద కుటుంబంలోని మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. నేరుగా మహిళా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు జమా చేస్తామని చెప్పారు. దేశంలోని యువతకు ఏడాదికి రూ.లక్ష వేతనం వచ్చేలా ఉపాధి కల్పిస్తామన్నారు. యువతకు నెలకు రూ.8,500తో సంవత్సరం పాటు శిక్షణ ఇస్తామని రాహుల్ గాంధీ హామి ఇచ్చారు.