దక్షిణాదిన, తూర్పు భారత దేశంలో బిజెపి కాస్త బలహీనంగా ఉంది. కర్ణాటకలో కాస్త మెరుగ్గా ఉంది. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, పిటిఐ ఎడిటర్లతో మాటామంతీ జరుపుతూ బిజెపి ఆదిపత్యం, అజేయ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నప్పటికీ దక్షిణాదిన, తూర్పున బిజెపి బలహీనంగానే ఉందని తెలిపారు.
తెలంగాణలో బిజెపి రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఒడిశాలో ప్రథమ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ లో కూడా బిజెపి నెంబర్ వన్ పార్టీ కాగలదని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. తమిళనాడులో బిజెపి వాటా రెండింతలు కాగలదని పేర్కొన్నారు.
లోక్ సభ 543 సీట్లలో తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళల వాటా 204 సీట్లుగా ఉంది. ఈ రాష్ట్రాలలో బిజెపి 2014 నుంచి 2019 వరకు 50 సీట్లను కూడా దాటలేదు. 47 నియోజకవర్గాల్లో 29 మాత్రమే గెలిచింది. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ మేరకు చేరుకోవడం బిజెపికి అసాధ్యమనే ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. 2019లో వైఎస్ఆర్ సి పార్టీకి ఆయన పనిచేశారు. అప్పట్లో టిడిపిని వైఎస్ఆర్ సి పార్టీ తుడిచేసింది. కానీ ఇప్పుడు టిడిపి, బిజెపి మిత్రపక్షంగా తయారయింది.
ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిన, పశ్చిమ భారత దేశంలో బిజెపి సీట్లను కొల్లగొడితేనే బిజెపి మట్టికరిచేది. కానీ అది అంత సులభం మాత్రం కాదు. ఏది ఏమైనప్పటికీ, బిజెపి కూటమి, కాంగ్రెస్ కూటమిల మధ్య పోరు తీవ్రంగా ఉండనున్నది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలలో బిజెపి, కాంగ్రెస్ కూటముల మధ్య పోరు నిర్ణయాత్మకంగా మారనున్నది.