లోక్ సభ ఎన్నికలకు ముందు యూట్యూబ్ లో ఆరోపణలు చేసే ప్రతి వ్యక్తిని కటకటాల వెనక్కి నెడుతూ పోతే ఎంత మందిని జైళ్లో పెట్టాల్సి వస్తుందో ఊహించండి అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో సత్తాయ్ అనే యూట్యూబ్ ఛానెల్ హోస్ట్ దురై మురుగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య చేసింది.
దురైమురుగన్ బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భుయాన్ లతో కూడిని ధర్మాసనం విచారణ చేపట్టింది. ధర్మాసనం యూట్యూబర్ కు మంజూరయిన బెయిల్ ను పునరుద్ధరించింది. అదే సందర్భంలో రాష్ట్రం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ఉద్దేశించి న్యాయమూర్తి ఓకా కీలక సవాలును లేవనెత్తారు.
ఎన్నికలకు ముందు, మేము యూట్యూబ్ లో ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరినీ కటకటాల వెనక్కి నెట్టడం ప్రారంభిస్తే, ఎంత మందికి జైలు శిక్ష పడుతుందో ఊహించండి అన్నారు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై దురైమురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింనందుకు అరెస్టు చేశారు.
తర్వాత అతడు బెయిల్ పై బయటికొచ్చారు. కానీ మద్రాస్ హైకోర్టు అతడి బెయిల్ ను రద్దు చేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు జరిగిన విచారణలో కోర్టు ఆయనకు బెయిల్ ను పునరుద్ధరించింది.